16, డిసెంబర్ 2018, ఆదివారం

ఆట

అట మొదలయ్యి ఇంకా కొన్ని ఎత్తులే అయ్యింది. చదరంగం బల్ల మధ్యలో బలమైన స్థానంలో గుర్రాన్ని పెట్టే అవకాశం వచ్చింది కానీ, ఆ గుర్రమే ప్రత్యర్థి శకటానికీ నా రాజుకీ మధ్యన కాపుగా ఉంది; ఎలా? అయితే రాజుని కోటలోనికి తీసుకొని పోవాలి: లేదా ముందుకు పోయిన శకటాన్ని రాజు రక్షణకు వెనుకకు తీసుకురావాలి. రాజుని కోటలోపలికి తీసుకుపోవడానికి నా రెండవ శకటం అడ్డంగా ఉంది. దాన్ని ముందుకి పంపటానికి ఒక ఎత్తు వృధా చేయాలి. మొదటి శకటాన్ని వెనక్కి తేవడానికి మధ్యలో బంటు అడ్డం పడుతుంది. ఈ పథకంలో కూడా ఒక ఎత్తు వృధా; పైగా ముందుకు పోయిన బంటు బలహీనపడుతుంది. అసలు తదుపరి ఎత్తులోనే ప్రత్యర్థి నా గుర్రాన్ని శకటంతో బలితీసుకుంటే పరిస్థితి ఏమిటి? అసలు ఈ గుర్రం పథకం వదలివేసి వేరొక వ్యూహం ఆలోచించటం ఉత్తమమేమో?

ఎప్పుడో చదివిన ఒక చదరంగం పుస్తకంలో రచయిత చదరంగంలో వ్యూహాలను చైనీయుల యుద్ధ కళలతో సంయమనం చేస్తూ ఎలా వ్యూహరచన చేయాలో చెబుతాడన్నమాట! స్థూలంగా చైనీయుల యుద్ధకళలో టైగర్ మరియు డ్రాగన్ అని రెండు వ్యూహ పద్ధతులుంటాయంట. టైగర్ అంటే నేరుగా కలబడిపోవటమన్నమాట. ఇది దాడి ప్రధానంగా సాగేది. రక్షణకు ప్రాధాన్యత తక్కువ. డ్రాగన్ అంటే రక్షణ ప్రధానంగా సాగే పోరాటం. ప్రత్యర్ధి సహనాన్ని, బలాన్ని నీరుగార్చి, తప్పులు చేయించి ఆఖరికి ఓడించటం. ఇందులో నేరుగా దాడి చేయటం ఉండదు. మనం పన్నే వ్యూహాలను ఈ రెండింటి ఆధారంగా వివరించే ప్రయత్నం చేస్తాడు రచయిత. మన తలకు అంతగా ఎక్కలేదనుకోండి!

మేము ఇంటర్ చదివేటప్పుడు ఆంగ్లంలో లేటరల్ థింకింగ్ అన్ని పాఠ్యాంశం ఉండేది. ఈ లేటరల్ థింకింగ్ కి ఆద్యుడు ఎడ్వర్డ్ డి బోనో. ఆ తరువాత అతను రచించిన అదే శీర్షిక గల పుస్తకాన్ని కొని చదవటం జరిగింది. మంచి పుస్తకం. అందులో లేటరల్ థింకింగ్ వృద్ధిపరచుకోవటానికి కొన్ని వ్యూహాలను ఆ రచయిత పొందుపరుస్తాడు. వాటిలో ఒక వ్యూహం, పోలికలు సంబంధాలు వెతకటం. యధాలాపంగా ఏవైనా రెండు వస్తువులు లేదా విషయాలు ఎంచుకొని వాటి మధ్య సంబంధాలూ పోలికలూ వెతకటమన్నమాట.

ఈ మధ్య ఎక్కడ చూసినా సి ఏ ఏ మరియు ఎన్ సి ఆర్ ల గురించిన వార్తలే. అసలు వీటిని వ్యతిరేకిస్తున్న వ్యక్తులను/సంఘాలను చూసిన తరువాత నాకనిపించిందేమిటంటే, టైగర్ మరియు డ్రాగన్ లను చిన్నబోయేలా చేసే గుంటనక్క వ్యూహాలు మన దగ్గర ఉన్నాయని. వెంటనే ఈ వ్యూహాలను అమలు పరచి చదరంగాన్ని కొత్తపుంతలు తొక్కిద్దామనుకున్నాను. కానీ ఈ గుంటనక్క వ్యూహానికి కావాల్సింది దేశద్రోహులు. దురదృష్టవశాత్తూ చదరంగంలో పావులు ప్రాణం పోయే వరకూ రాజు రక్షణకై పోరాడతాయి తప్ప స్వామి ద్రోహం చేయలేవు.
ఎడ్వర్డ్ డిబోనో మహాశయుడు కూడా ఆ దేశద్రోహులకీ ఈ చదరంగం పావులకీ పోలిక తీ‌సుకురాలేరని నా ప్రగాఢ విశ్వాసం.

8, అక్టోబర్ 2018, సోమవారం

విద్య

అలా యథాలాపంగా నడుస్తూ ఒక ఉన్నత పాఠశాల గోడపై రాసిన "విద్య లేని వాడు వింత పశువు" అన్న లోకోక్తిని చదవటం తటస్థించింది. ఈ లోకోక్తి మనం చిన్నప్పటినుండీ వింటున్నదే కదా. కానీ ఎప్పుడూ లేనిది ఈ సారి ఇది చాలా అనాలోచితమైన లోకోక్తి అనిపించింది. మరీ చదువు రానంత మాత్రానా వింత పశువు అని చిన్నబుచ్చాలా? మరి మా తాతగారు కూడా చదువుకోలేదే. అమ్మో!!! అసలే ఇది మనోభావాలు బహు సున్నితంగా తయారైన కాలం కదా. చదువు రానివాళ్ళందరూ కలిసి ఈ సామాజిక వివక్షకి వ్యతిరేకంగా పోరాటాలేవీ ఇంకా మొదలుపెట్టలేదేంటి? అంటే వాళ్ళకు ఎలాగూ చదవటం రాదు కదా! అందుచేత వారి గురించి ఇలా బరబరా గోడలపైనా, పుస్తకాల్లోనూ రాసేస్తున్నారని తెలియకపోవడం వల్ల అయ్యుండొచ్చు. బ్రతికిపోయాం!

కానీ అసలు విద్య అంటే చదవటమేనా?

కేవలం చదవటం అన్న చట్రంలో మాత్రమే విద్యను ఇరికించకూడదు కదా. ఒక వడ్రంగం పని, కుమ్మరి పని, కంసాలి పని...ఆఖరుకి గారడీ కానివ్వండి, తాటాకు బుట్టలు అల్లడం కానివ్వండి, ఇటువంటివన్నీ విద్యలే కదా. చదువగలిగే సామర్థ్యం కూడా వీటికి జత అయితే వీరు మరింత రాణించగలిగి ఉండొచ్చు గానీ విద్యలేనివారు అని మాత్రం వారిని అనలేము.

మరి ఇంత కఠినమైన లోకోక్తి ఎలా వాడుకలోనికి వచ్చింది? మన వాళ్ళు మరీ ఇంత అడ్డగోలు సాధారణీకరణలు చేయరే! బహుశా క్రింది సుభాషితం దీనికి ప్రేరణ అయ్యుండొచ్చు.

విద్య నిగూఢగుప్తమగు విత్తమురూపము పురుషాళికిన్
విద్య యశస్సు భోగకరీ విద్య గురుఁడు విదేశ బంధుఁడున్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్
విద్యనృపాల పూజితము విద్యనెరుంగని వాడు మర్త్యుడే!

భర్తృహరి సుభాషితానికి ఏనుగు లక్ష్మణకవి తెలుగు అనువాదం. ఇది మనందరం చదువుకున్న పద్యమే కదా. విద్య యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చివర్లో అసలు విద్యలేని వాడు మనిషేనా! అని ఆశ్చర్యంతో ప్రశ్నిస్తున్నారన్నమాట....మనిషిగా పుట్టిన తరువాత ఏదో ఒక విద్య నేర్చుకుని తీరాలని మన వాళ్ళ అభిలాష. కాని చదవటం ఒక్కటి మాత్రమే విద్య కాదు.

అసలు విద్య అనేది ఎందుకు?
కోటి విద్యలు కూటి కొరకే అని లోకోక్తి. అంటే విద్య అనేది కేవలం ఉపాది కోసమేనా? దీనిగురించి మనవాళ్ళు ఏమన్నారంటే....

విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతామ్
పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాద్ధర్మమ్ తతః సుఖమ్
(హితోపదేశమ్)

విద్యచేత వినయము, తద్వారా పాత్రత, దానినుండి ధనమూ, ధనము చేత ధర్మము అంతిమంగా సుఖమూనూ. ఇంత స్పష్టంగా చెప్పిన తరువాత ఇంకేంటి అనుమానం!

కానీ విద్య నేర్చుకున్నవారందరికీ వినయం అబ్బుతుందా? వినయం లోపించినంతమాత్రానా విద్యా హీనులౌతారా? ఏమో? ఐతే ఇక్కడ 'విద్యచే భూషితుండయి వెలయుచున్న దొడరివర్జింపనగు...', అని అంటూ మరొక సుభాషితంలో....

సర్లెండి..కోప్పడొద్దు. ఆపేస్తాను.  పునర్మిలామః

16, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఓంకార్

ఇది ఎప్పుడో ఓంకార్ గారి పుస్తకంలో చదివిన కథ.

వయస్సు తొంభైలలో ఉండి చావడానికి సిద్ధంగా ఉన్న ఒక కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త, తాను తెలుగుదేశం పార్టీలోకి మారుతున్నట్లు ప్రకటించడం ఆ ఊర్లో అక్కడినుండి పాకి ఏకంగా రాష్ట్రంలోనే చర్చనీయాంశం అయ్యింది. రేపోమాపో చనిపోయే ముసలతనికి ఇంకా ఆ పార్టీల గొడవెందుకూ! ముసలివాడికి మతి భ్రమించిందని కాంగ్రెస్ పార్టీవాళ్ళు రుసరుసలాడారు. ముసలాడికి చివరి నిముషంలో అయినా బుద్ధి సరిగా పనిచేసి తమ పార్టీలొనికి రానున్నాడని అనుకొని పసుపు చొక్కాల ఛాతీలు పొంగాయి. ఈ సంఘటనకి సాధ్యమైనంత ప్రచారం కల్పించి లబ్ధిపొందాలని పసుపు తమ్ముళ్ళు ఆ పార్టీలో ముసలతను చేరే రోజుని భారీగా రాష్ట్రస్థాయి నాయకుల సమక్షంలో జరిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తీరా ఆ రోజు రానే వచ్చింది. ముసలతను పార్టీ మారటమూ జరిగింది. అన్ని పత్రికలు మరియు టివి వాళ్ళ సమక్షంలో అసలు ఈ వయసులో ఇలా పార్టీ మారే ఆలోచన ఎందుకు చేశారని అడిగితే, తాను కాంగ్రెస్ పార్టీలో ఉండగా చనిపోతే ఒక కాంగ్రెసోడు చనిపోయాడని అందరూ అనుకుంటారనీ, అది తనకు ఇష్టంలేదనీ, అందుకనే చనిపోయే ముందు పసుపు పార్టీలో చేరాననీ ముసలతను చెప్పగానే కార్యక్రమానికి వచ్చిన కొన్ని పెద్ద పసుపు చొక్కాలు స్పృహ కోల్పోయి కార్యక్రమం అంతా రసాభాస అవుతుంది.

అసలు ఇటువంటి సంఘటన ఎక్కడైనా నిజంగా జరిగే ఉంటుందా అని అనిపించేది. మరీ ముదిమి వయసులో కూడా ఇలా పార్టీలు, భావజాలాలు అంటూ ద్వేషించుకోవటం... కానీ మన కరడుగట్టిన కమ్యూనిస్టు వృద్ధులను చూసినతరువాత జ్ఞానోదయం ఐపోతుందనుకోండి. అది వేరే విషయం.

మన దేశంలో జాతీయవాదులపై,  టెర్రరిస్టులూ మరియు దేశ ద్రోహులపై ఉన్నంత సానుభూతి ఉండదు. హిందువులూ మరియూ మైనార్టీల విషయంలో కూడా అంతే. టెర్రరిస్టులకు సంఘీభావం తెలుపుతాం. సైనికులని తూలనాడతాం. చర్చిపై రాళ్ళు విసిరితే అంతర్జాతీయ వార్త. గుడుల్లో దశాబ్దాల తరబడి జరుగుతున్న విగ్రహ చోరీ మరియు నిధుల త్రవ్వకాలు పెద్ద విషయం కాదు. మైనార్టీల మనోభావాలకున్నంత విలువ హిందువుల మనోభావాలకు లేదు. కాబట్టి ఇక నుండి ఎవరినైనా శిక్షంచాలనుకొనేటప్పుడు ప్రభుత్వం ముందుగా వాళ్ళకి హిందూత్వ లేదా జాతీయవాద ముద్ర వేసేస్తే ఎవరి మనో భావాలూ దెబ్బ తినవనుకుంటా. ఇప్పుడు ఉదాహరణకి హర్యాణాలో ఎవరో బిషప్ మీద అత్యాచార ఆరోపణలు వచ్చి రెండు నెలలు దాటినా ఇంకా పోలీసులూ అరెస్టు చెయ్యలేదంట. అదే హిందూ స్వామీజీ ఐతే పరిస్థితి వేరే విధంగా ఉండేది కదా. కాబట్టి ఆ బిషప్ ఒక కరడు గట్టిన హిందూత్వ వాది. మైనార్టీలకు చెడ్డపేరు తేవడానికి అలా బిషప్ గా మారి ఆ విధంగా చేశాడు అని చెప్పి మూసేస్తే ఇటు మైనార్టీల మనోభావాలు భంగపడవు. హిందువులకు ఎలాగూ అలవాటైపోయింది కాబట్టి ఇది పెద్ద విషయంకాదు.

ఏంటీ? ప్రతీది మరీ అసంబద్ధంగా గోరంతను కొండంతదిలా చేసి చూస్తున్నానా? ఉండండి, నేనుకూడా లౌకిక కళ్ళద్దాలు పెట్టేసుకుంటా....

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

'ఆలస్యం అమృతం విషం'

సినిమా పేరు గుర్తులేదు కానీ ఒక తెలుగు సినిమాలో, పట్టభద్రులై కళాశాలలో ప్రధమ స్థానంకోసం పోటీ పడే ఇద్దరు యువకులను వాళ్ళకు స్పూర్తినిచ్చే మాటలను చెప్పమంటారు. అప్పుడు మొదటి యువకుడు "నిదానమే ప్రధానం" అని చెబితే రెండవ యువకుడు "ఆలస్యం అమృతం విషం" అని చెబుతాడు.

ఆలస్యం మరియు నిదానం ఒకటేనా? ఏమో!

'ఆలస్యం అమృతం విషం' అని అంటుంటారు కదా. ఏదైనా పని చేసేటప్పుడు మనం ఆచరించవలసిన వ్యూహానికి సంబంధించినదీ సామెత. అలాగే తొందరపాటు కూడా సమయాన్ని బట్టి అమృతం లేదా విషం అవుతుంటుంది. ఆలస్యం అమృతం విషం అన్న విషయంలో సందేహం లేనప్పటికీ అది ఎప్పుడు అమృతమవుతుంది లేదా ఎప్పుడు విషమవుతుంది అన్న విషయం మాత్రం ఎప్పటికీ అంతుచిక్కదుకదా!

దీని గురించి మహాభారతం శాంతి పర్వంలో ఒక కథ ఉంటుంది. ఒక పని ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో తెలుసుకొనేది ఎలా తాతా అని ధర్మరాజు అడిగితే భీష్ముడు చిరకారి అనే వాడి కథ చెబుతాడు.

చిరకారి అనేవాడు గౌతమ మహర్షి కొడుకు. ప్రతి పనినీ చేసేముందు పరిపరి విధాల ఆలోచించి ఆ పనిని చేసేవాడు కావున చిరకారి అని పిలిచేవారన్నమాట. అలాగే మందబుద్ధి అని కూడా పిలిచేవారట తనని.  ఒక సారి గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యపై కోపం చేత ఆమెను చంపివేయమని చిరకారికి ఆజ్ఞాపించి అడవికి వెళ్ళిపోతాడు. ఇక అప్పటినుండి మొదలౌతుంది చిరకారిలో అంతర్మథనం. ఒక వైపు పితృవాక్య పరిపాలన, మరొకవైపు మాతృహత్యా పాతకం. ఏం చేయాలో పాలుపోక తల్లిదండ్రుల యొక్క గొప్పదనముల గురించి పరిపరి విధముల ఆలోచిస్తుంటాడు. అమ్మంటే ఎవరు? నన్ను కడుపులో పెట్టుకు పెంచేది కావున ధాత్రి అనీ జన్మనిచ్చినది కావున జనని అనీ, అవయవపుష్ఠి కలిగించింది కావున అంబ అనీ, బాల్యంలో శుశ్రూష చేయటం చేత శ్వశ్రువనీ.....ఇలా సాగుతుంది చిరకారి చింతన.

ఈలోగా తన తొందరపాటును తెలుసుకున్న గౌతమ మహర్షి చిరకారి అహల్యను చంపివేశాడేమోనని కంగారుపడుతూ దుఃఖంతో ఇంటిముఖం పడతాడు. ఇంటివద్ద అహల్య సజీవంగానే ఉండటం చూసి మహదానందపడి చిరకారిని కౌగిలించుకుని చిరకాలం జీవించమని ఆశీర్వదిస్తాడు.

ఈ విధంగా ఏ పనైనా సరే తగినంత ఆలోచించి చేయటంవల్ల కీర్తి లభిస్తుందని కథని ముగిస్తారు భీష్మాచార్యులు.

ఈ కథలో గౌతమ మహర్షి తొందరపాటును చిరకారి చేసిన ఆలస్యం నిర్వీర్యం చేసిందికదా. ఐతే ప్రతిసారి కూడా ఆలోచించేంత సమయం ఉంటుందా? ఒక వేళ తగినంత సమయం ఉన్నా మనం సరైన నిర్ణయం చేయగలమన్న నమ్మకం ఏమిటి? అందుకేనేమో, చిరకాలం వృద్ధులనాశ్రయించమని చెప్పారు పెద్దలు. ఇంతకీ వృద్ధులంటే ఎవరు? బుద్ధి చేత వృద్ధులు గానీ వయసుచేత కాదంట వృద్ధులు. నిజమేననుకుంటా. అందరికీ మేలు చేకూర్చేదే ధర్మమంట.  ఏ పని చేసినా ఎక్కువ మందికి మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంటే ధర్మాచరణ చేసినట్టన్నమాట. అప్పుడు నిదానం ప్రధానమవ్వచ్చు. ఆలస్యం అమృతమవ్వచ్చు.

3, సెప్టెంబర్ 2018, సోమవారం

స్వధర్మము

ఒక గొర్రెల మందపై దాడి చేయబోయిన కడుపుతో ఉన్న సింహం సింహం పిల్లను ప్రసవించి చనిపోతుంది. అప్పటినుంచి ఆ సింహం పిల్ల గొర్రెల మందలోనే సాకబడి పెరిగి పెద్దవుతుందన్నమాట. కాకపోతే పాపం ఆ సింహం తాను కూడా గొర్రెనే అని భ్రమిస్తూ గొర్రెల వలె ప్రవర్తిస్తుండేది. ఒక సారి వేరొక సింహం ఆ గొర్రెల మందపై దాడి చేయగా ఆ గొర్రెలతో పాటు వాటితో పెరిగిన సింహం కూడా భయపడి పారిపోవటం ప్రారంభిస్తుంది. ఈ విషయాన్ని గమనించిన దాడి చేసిన సింహం ఒకింత ఆశ్చర్యానికి లోనవుతుంది. అది నెమ్మదిగా మందలోని సింహాన్ని చేరి అది కూడా తనలాంటి సింహమేననీ, ఎందుకు అలా భయపడుతోంది అనీ అడుగుతుంది. అప్పుడు ఆ మందలోని సింహం తాను సింహం కాదనీ గొర్రెననీ ఉద్ఘాటిస్తుంది. గొర్రెలా అరుస్తుంది. అప్పుడు ఆ దాడి చేసిన సింహం మందలోని సింహాన్ని ఒక కొలను దగ్గరకి తీసుకుపోయి అక్కడ నీటిలో తమ ఇద్దరి ప్రతిబింబాలు చూపిస్తుంది. తామిద్దరూ ఒకేలా ఉండటం గమనించిన మందలోని సింహం తాను కూడా సింహాన్నే అన్న విషయం గ్రహించి ఒక్కసారిగా ఊపిరి తీసుకొని గట్టిగా గర్జిస్తుంది. సింహంలా బ్రతకటం మొదలుపెడుతుంది.

ఇది మనందరికీ తెలిసిన కథే!
మన దేశానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ చిన్నచూపు చూసే మందలో సింహాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. కృష్ణాష్ఠమి, దీపావళి, హోళి, దసరా, విగ్రహారాధన, బహుళ దేవతారాధన, జ్యోతిష్యం, పురాణాలు, ఇతిహాసాలు, ఆచారాలూ అలవాట్లూ వీటన్నిటినీ ఏదో ఒక విజాతీయ గొర్రె మంద చెప్పిందని చెప్పి వాటిని విస్మరిస్తూ తమ సొంత అస్తిత్వాన్ని మరిచిపోయిన భారతీయ సింహాలు  దేశానికి అజాగళస్తనాలవలె దాపురించారు.
నువ్వు గొర్రెవి అని చెప్పే సాహిత్యానికున్న ప్రచారమూ వనరులూ మన మూల సాహిత్యానికి ఉండటం లేదు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితులలో కొంచెం మార్పు కనిపిస్తుండటం ముదావహము.

"బాగుగా ఆచరించబడిన పరధర్మముకంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్ఠమైనది. స్వభావమును అనుసరించి కర్మలననుసరించు మనుష్యునకు ఎట్టి పాపములునూ ఏమాత్రము అంటనే అంటవు." - శ్రీకృష్ణ ఉవాచ, భగవద్గీత

23, ఆగస్టు 2018, గురువారం

రెండు కథలు

రెండు కథలు. (ఇవన్నీ మా పాఠ్యాంశాలలోనివే)

1. అనగనగా ఒక కప్పల రాజ్యం ఉండేది. ఒక సారి ఆ రాజ్యంలోకి ఒక ముసలి పాము వస్తుంది. దాంతో ఆ కప్పలలో భయం మొదలవుతుంది. ఈ సంగతేంటో తేలుద్దామనుకున్న కప్పల రాజుతో తాను ముసలి పాముననీ, వేటాడలేననీ కావాలంటే రోజూ రాజుగారిని తన వీపుపై మోస్తానని, పాముపై ఊరేగే కప్పగా తనకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలొస్తాయనీ ఆశ పెడుతుంది. ఆ ప్రతిపాదనకు సరే అన్న కప్పల రాజు రోజూ పాముపై ఊరేగటం మొదలు పెడతాడు. కానీ ఒక రోజు పాము కదలక మొరాయిస్తుంది. ఎందుకనడిగిన కప్పల రాజుతో తాను ఏమీ తినక నీరసించాననీ కనీసం ఒక కప్పనైనా తింటే తప్ప కదలలేననీ బదులిస్తుంది. ఐతే పాముపై ఊరేగటానికి అలవాటు పడ్డ కప్పల రాజు సరే తినమని పాముకి అనుమతి ఇస్తాడు. ఇక  అప్పటి నుంచి అది నిత్య కృత్యమైపోతుంది. కప్పలను బాగా తిని తెగ బలిసిన పాము ఒకానొక శుభముహూర్తాన ఆ కప్పల రాజుని కూడా ఆరగించేస్తుంది. ఆ విధంగా మొత్తం కప్పలన్నింటినీ ఫలహారం చేసిన పాము మరొక కొత్త రాజ్యాన్ని వెతుక్కుంటూ పోయింది.

2. అనగనగా ఒక ఎలుకల రాజ్యం ఉండేదన్నమాట. ఎలుకలకి వారి రాజంటే అత్యంత భక్తి ప్రపత్తులన్నమాట. అయితే ఇలా ఆనందంగా సాగిపోతున్న ఎలుకల రాజ్యంలోనికి ఒక బక్కచిక్కిన ముసలి పిల్లి వస్తుంది. దాన్ని చూడగానే ఎలుకలన్నీ చాలా భయపడిపోతాయి. అప్పుడు ఆ ఎలుకల రాజు ఆ పిల్లి అంతు తేలుద్దామని దానిదగ్గరకు పోగా, తాను సాధారణమైన పిల్లిని కాననీ, గొప్ప మహిమలు గలదాన్ననీ, శాకాహారం మాత్రమే తీసుకుంటాననీ, కావున ఎలుకలన్నీ ప్రతిరోజూ వరుసలో వచ్చి దీవెనలందుకుంటే మేలు జరుగుతుందనీ నమ్మబలుకుతుంది. ఆ మాటలను నమ్మిన ఎలుకరాజు రోజూ తన ఎలుకలన్నింటినీ పిల్లి వద్ద దీవెనలకోసం పంపేవాడు. కొన్ని రోజులకి ఎలుకల సంఖ్య తగ్గటం ఆరంభమయ్యింది. పిల్లిని చూస్తే రోజురోజుకీ బలుస్తోంది. ఇంతకీ జరుగుతున్నదేమిటంటే ప్రతి రోజూ వరుసలో ఆఖరి ఎలుకని పిల్లి గుటుక్కున మింగేసేది. అయితే ఈ సంగతి తెలియని రాజు అసలు ఏమవుతుందో గమనిద్దామని ఒక రోజు వరుసలో ఆఖరున ఉంటాడు. తన వంతు రాగానే తనని తినేందుకు నోరు తెరచిన పిల్లిని చూసి విషయం అర్థమయ్యి వెంటనే తన ఖడ్గంతో ఆ పిల్లి తలని నరికేస్తాడన్నమాట.

ఈ రెండు కథల్లోని రాజులను ఈ రోజుల్లో లౌకికవాదులు అని పిలుస్తున్నారంట. మొదటి కథ మన దేశంలో ప్రస్తుతం జరుగుతుంది. రెండవ కథ లాంటి ముగింపు వచ్చే సూచనలు ఉన్నాయో లేదో వచ్చే సంవత్సరం తెలిసిపోతుంది.

9, మార్చి 2018, శుక్రవారం

యద్భావం తద్భవతి

కొన్నేళ్ళ క్రిందట 'ఓయ్' అని ఒక సినిమా చూసాను. ఆ సినిమాలో కథానాయకుడు రేపుంటుందో లేదో తెలియదు కనుక ఈరోజే సాధ్యమైనంత ఆనందాన్ని నింపుకోవాలనుకునే రకం. కథానాయకి మాత్రం ఏం చేసినా సరే అన్నీ దీర్ఘకాలిక ప్రణాళికతో చేస్తూ క్రమబద్ధమైన జీవితం గడిపే బాపతు. ఇద్దరికీ కలుగుతుంది పరిచయం, ఆపై ప్రేమ. ఆఖరుకి, జీవితం చాలా పెద్దది అనుకున్న కథానాయకి, అల్పాయుర్ధాయంతో అర్ధాంతరంగా చనిపోతుంది. జీవితం చాలా చిన్నదనుకునే కథానాయకుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోతాడు; ప్రేయసి తనకి మిగిల్చిన ఒంటరి ఇంకా సుదీర్ఘమైన శేష జీవితంతో.

మేము చదువుకునే రోజుల్లో ఒక తెలుగు పాఠం ఉండేది. రచయుత పేరు గురుతులేదు. అందులో ఈ విధంగా మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా జరిగేది నిత్యజీవన దృగ్విషయమని బోలెడు ఉదాహరణలు ఇస్తాడు రచయిత. ఉదాహరణకి, ఇప్పుడు, ఒక రోజు ఏదో కారణంచేత ఆఫీసుకి వెళ్లటం ఆలస్యం అయ్యిందనుకోండి, దారిలో మనం మనసులో ఏ ఉపద్రవం జరుగకూడదని దేవుడికి మొరపెట్టుకుంటామా! సరిగ్గా అదే రోజు మన పై అధికారులు ఆకస్మిక తనిఖీ అంటూ ఊడిపడతారన్నమాట.

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినదని పెద్దలంటుంటారు కదా. ఇదేనన్నమాట. కాని ఇదే పెద్దలు 'యద్భావం తద్భవతి' అని కూడా అంటుంటారు కదా. అంటే నువ్వేమనుకుంటే అదే అవుతుందని. దీన్నే 'ది సీక్రెట్' అన్న పుస్తకంలో రోండా బ్రైన్ గారూ, 'ది ఆల్కెమిస్ట్' అన్న పుస్తకంలో పాలో కొయల్హో గారూ తమదైన శైలిలో చెప్పారు. ఈ యద్భావం తద్భవతి గురించి ఒక ఆసక్తికరమైన ప్రాకృతిక ఉపమానాన్ని పెద్దలు చెబుతుంటారు. అదేమిటంటే, కందిరీగలు సంతానోత్పత్తిలో భాగంగా ఒక రకమైన కీటకం యొక్క లార్వాలను దొంగిలించి, వాటి చుట్టూ గూడు కట్టి పెద్దగా రొద చేసుకుంటూ ఆ లార్వా చుట్టూ పరిభ్రమిస్తాయంట. అప్పుడు ఆ లార్వాలు పిల్ల కందిరీగల్లా మారిపోతాయట. బాగుంది కదూ.

ఇక్కడ కందిరీగకు యద్భావం తద్భవతి ఐతే, కీటక లార్వాకి మాత్రం అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి జరిగింది. అనుకున్నది జరిగే అవకాశం ఉంటే మొదటిది, లేకుంటే రెండోది అన్నమాట. దీన్నే ఏ ఎండకాగొడుగును పట్టడం అని పెద్దలంటుంటారు. నేర్పు, విజ్ఞత, లౌక్యం అని కూడా అంటుంటారు.

ఈ అనుకున్నదొకటీ అయినదొకటీలు కాకుండా జీవితంలో 'యద్భావం తద్భవతీ'లు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా. కానీ నిజం ఏమవ్వచ్చు తాతా అని మా తాతగారిని అడిగితే, మనవడా నువ్వనుకున్నది ధర్మబద్ధమైనదైతే 'యద్భావం తద్భవతి' లేకపోతే 'అనుకున్నదొకటి అయినది ఒక్కటి' అని చెప్పేవారేమో....!

ఇంతకీ నేనేమనుకుంటున్నాను? ఏమొ?

అందరికీ యద్భావం తద్భవతి.