సినిమా పేరు గుర్తులేదు కానీ ఒక తెలుగు సినిమాలో, పట్టభద్రులై కళాశాలలో ప్రధమ స్థానంకోసం పోటీ పడే ఇద్దరు యువకులను వాళ్ళకు స్పూర్తినిచ్చే మాటలను చెప్పమంటారు. అప్పుడు మొదటి యువకుడు "నిదానమే ప్రధానం" అని చెబితే రెండవ యువకుడు "ఆలస్యం అమృతం విషం" అని చెబుతాడు.
ఆలస్యం మరియు నిదానం ఒకటేనా? ఏమో!
'ఆలస్యం అమృతం విషం' అని అంటుంటారు కదా. ఏదైనా పని చేసేటప్పుడు మనం ఆచరించవలసిన వ్యూహానికి సంబంధించినదీ సామెత. అలాగే తొందరపాటు కూడా సమయాన్ని బట్టి అమృతం లేదా విషం అవుతుంటుంది. ఆలస్యం అమృతం విషం అన్న విషయంలో సందేహం లేనప్పటికీ అది ఎప్పుడు అమృతమవుతుంది లేదా ఎప్పుడు విషమవుతుంది అన్న విషయం మాత్రం ఎప్పటికీ అంతుచిక్కదుకదా!
దీని గురించి మహాభారతం శాంతి పర్వంలో ఒక కథ ఉంటుంది. ఒక పని ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో తెలుసుకొనేది ఎలా తాతా అని ధర్మరాజు అడిగితే భీష్ముడు చిరకారి అనే వాడి కథ చెబుతాడు.
చిరకారి అనేవాడు గౌతమ మహర్షి కొడుకు. ప్రతి పనినీ చేసేముందు పరిపరి విధాల ఆలోచించి ఆ పనిని చేసేవాడు కావున చిరకారి అని పిలిచేవారన్నమాట. అలాగే మందబుద్ధి అని కూడా పిలిచేవారట తనని. ఒక సారి గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యపై కోపం చేత ఆమెను చంపివేయమని చిరకారికి ఆజ్ఞాపించి అడవికి వెళ్ళిపోతాడు. ఇక అప్పటినుండి మొదలౌతుంది చిరకారిలో అంతర్మథనం. ఒక వైపు పితృవాక్య పరిపాలన, మరొకవైపు మాతృహత్యా పాతకం. ఏం చేయాలో పాలుపోక తల్లిదండ్రుల యొక్క గొప్పదనముల గురించి పరిపరి విధముల ఆలోచిస్తుంటాడు. అమ్మంటే ఎవరు? నన్ను కడుపులో పెట్టుకు పెంచేది కావున ధాత్రి అనీ జన్మనిచ్చినది కావున జనని అనీ, అవయవపుష్ఠి కలిగించింది కావున అంబ అనీ, బాల్యంలో శుశ్రూష చేయటం చేత శ్వశ్రువనీ.....ఇలా సాగుతుంది చిరకారి చింతన.
ఈలోగా తన తొందరపాటును తెలుసుకున్న గౌతమ మహర్షి చిరకారి అహల్యను చంపివేశాడేమోనని కంగారుపడుతూ దుఃఖంతో ఇంటిముఖం పడతాడు. ఇంటివద్ద అహల్య సజీవంగానే ఉండటం చూసి మహదానందపడి చిరకారిని కౌగిలించుకుని చిరకాలం జీవించమని ఆశీర్వదిస్తాడు.
ఈ విధంగా ఏ పనైనా సరే తగినంత ఆలోచించి చేయటంవల్ల కీర్తి లభిస్తుందని కథని ముగిస్తారు భీష్మాచార్యులు.
ఈ కథలో గౌతమ మహర్షి తొందరపాటును చిరకారి చేసిన ఆలస్యం నిర్వీర్యం చేసిందికదా. ఐతే ప్రతిసారి కూడా ఆలోచించేంత సమయం ఉంటుందా? ఒక వేళ తగినంత సమయం ఉన్నా మనం సరైన నిర్ణయం చేయగలమన్న నమ్మకం ఏమిటి? అందుకేనేమో, చిరకాలం వృద్ధులనాశ్రయించమని చెప్పారు పెద్దలు. ఇంతకీ వృద్ధులంటే ఎవరు? బుద్ధి చేత వృద్ధులు గానీ వయసుచేత కాదంట వృద్ధులు. నిజమేననుకుంటా. అందరికీ మేలు చేకూర్చేదే ధర్మమంట. ఏ పని చేసినా ఎక్కువ మందికి మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంటే ధర్మాచరణ చేసినట్టన్నమాట. అప్పుడు నిదానం ప్రధానమవ్వచ్చు. ఆలస్యం అమృతమవ్వచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి