ఒక గొర్రెల మందపై దాడి చేయబోయిన కడుపుతో ఉన్న సింహం సింహం పిల్లను ప్రసవించి చనిపోతుంది. అప్పటినుంచి ఆ సింహం పిల్ల గొర్రెల మందలోనే సాకబడి పెరిగి పెద్దవుతుందన్నమాట. కాకపోతే పాపం ఆ సింహం తాను కూడా గొర్రెనే అని భ్రమిస్తూ గొర్రెల వలె ప్రవర్తిస్తుండేది. ఒక సారి వేరొక సింహం ఆ గొర్రెల మందపై దాడి చేయగా ఆ గొర్రెలతో పాటు వాటితో పెరిగిన సింహం కూడా భయపడి పారిపోవటం ప్రారంభిస్తుంది. ఈ విషయాన్ని గమనించిన దాడి చేసిన సింహం ఒకింత ఆశ్చర్యానికి లోనవుతుంది. అది నెమ్మదిగా మందలోని సింహాన్ని చేరి అది కూడా తనలాంటి సింహమేననీ, ఎందుకు అలా భయపడుతోంది అనీ అడుగుతుంది. అప్పుడు ఆ మందలోని సింహం తాను సింహం కాదనీ గొర్రెననీ ఉద్ఘాటిస్తుంది. గొర్రెలా అరుస్తుంది. అప్పుడు ఆ దాడి చేసిన సింహం మందలోని సింహాన్ని ఒక కొలను దగ్గరకి తీసుకుపోయి అక్కడ నీటిలో తమ ఇద్దరి ప్రతిబింబాలు చూపిస్తుంది. తామిద్దరూ ఒకేలా ఉండటం గమనించిన మందలోని సింహం తాను కూడా సింహాన్నే అన్న విషయం గ్రహించి ఒక్కసారిగా ఊపిరి తీసుకొని గట్టిగా గర్జిస్తుంది. సింహంలా బ్రతకటం మొదలుపెడుతుంది.
ఇది మనందరికీ తెలిసిన కథే!
మన దేశానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ చిన్నచూపు చూసే మందలో సింహాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. కృష్ణాష్ఠమి, దీపావళి, హోళి, దసరా, విగ్రహారాధన, బహుళ దేవతారాధన, జ్యోతిష్యం, పురాణాలు, ఇతిహాసాలు, ఆచారాలూ అలవాట్లూ వీటన్నిటినీ ఏదో ఒక విజాతీయ గొర్రె మంద చెప్పిందని చెప్పి వాటిని విస్మరిస్తూ తమ సొంత అస్తిత్వాన్ని మరిచిపోయిన భారతీయ సింహాలు దేశానికి అజాగళస్తనాలవలె దాపురించారు.
నువ్వు గొర్రెవి అని చెప్పే సాహిత్యానికున్న ప్రచారమూ వనరులూ మన మూల సాహిత్యానికి ఉండటం లేదు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితులలో కొంచెం మార్పు కనిపిస్తుండటం ముదావహము.
"బాగుగా ఆచరించబడిన పరధర్మముకంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్ఠమైనది. స్వభావమును అనుసరించి కర్మలననుసరించు మనుష్యునకు ఎట్టి పాపములునూ ఏమాత్రము అంటనే అంటవు." - శ్రీకృష్ణ ఉవాచ, భగవద్గీత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి