ఇది ఎప్పుడో ఓంకార్ గారి పుస్తకంలో చదివిన కథ.
వయస్సు తొంభైలలో ఉండి చావడానికి సిద్ధంగా ఉన్న ఒక కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త, తాను తెలుగుదేశం పార్టీలోకి మారుతున్నట్లు ప్రకటించడం ఆ ఊర్లో అక్కడినుండి పాకి ఏకంగా రాష్ట్రంలోనే చర్చనీయాంశం అయ్యింది. రేపోమాపో చనిపోయే ముసలతనికి ఇంకా ఆ పార్టీల గొడవెందుకూ! ముసలివాడికి మతి భ్రమించిందని కాంగ్రెస్ పార్టీవాళ్ళు రుసరుసలాడారు. ముసలాడికి చివరి నిముషంలో అయినా బుద్ధి సరిగా పనిచేసి తమ పార్టీలొనికి రానున్నాడని అనుకొని పసుపు చొక్కాల ఛాతీలు పొంగాయి. ఈ సంఘటనకి సాధ్యమైనంత ప్రచారం కల్పించి లబ్ధిపొందాలని పసుపు తమ్ముళ్ళు ఆ పార్టీలో ముసలతను చేరే రోజుని భారీగా రాష్ట్రస్థాయి నాయకుల సమక్షంలో జరిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తీరా ఆ రోజు రానే వచ్చింది. ముసలతను పార్టీ మారటమూ జరిగింది. అన్ని పత్రికలు మరియు టివి వాళ్ళ సమక్షంలో అసలు ఈ వయసులో ఇలా పార్టీ మారే ఆలోచన ఎందుకు చేశారని అడిగితే, తాను కాంగ్రెస్ పార్టీలో ఉండగా చనిపోతే ఒక కాంగ్రెసోడు చనిపోయాడని అందరూ అనుకుంటారనీ, అది తనకు ఇష్టంలేదనీ, అందుకనే చనిపోయే ముందు పసుపు పార్టీలో చేరాననీ ముసలతను చెప్పగానే కార్యక్రమానికి వచ్చిన కొన్ని పెద్ద పసుపు చొక్కాలు స్పృహ కోల్పోయి కార్యక్రమం అంతా రసాభాస అవుతుంది.
అసలు ఇటువంటి సంఘటన ఎక్కడైనా నిజంగా జరిగే ఉంటుందా అని అనిపించేది. మరీ ముదిమి వయసులో కూడా ఇలా పార్టీలు, భావజాలాలు అంటూ ద్వేషించుకోవటం... కానీ మన కరడుగట్టిన కమ్యూనిస్టు వృద్ధులను చూసినతరువాత జ్ఞానోదయం ఐపోతుందనుకోండి. అది వేరే విషయం.
మన దేశంలో జాతీయవాదులపై, టెర్రరిస్టులూ మరియు దేశ ద్రోహులపై ఉన్నంత సానుభూతి ఉండదు. హిందువులూ మరియూ మైనార్టీల విషయంలో కూడా అంతే. టెర్రరిస్టులకు సంఘీభావం తెలుపుతాం. సైనికులని తూలనాడతాం. చర్చిపై రాళ్ళు విసిరితే అంతర్జాతీయ వార్త. గుడుల్లో దశాబ్దాల తరబడి జరుగుతున్న విగ్రహ చోరీ మరియు నిధుల త్రవ్వకాలు పెద్ద విషయం కాదు. మైనార్టీల మనోభావాలకున్నంత విలువ హిందువుల మనోభావాలకు లేదు. కాబట్టి ఇక నుండి ఎవరినైనా శిక్షంచాలనుకొనేటప్పుడు ప్రభుత్వం ముందుగా వాళ్ళకి హిందూత్వ లేదా జాతీయవాద ముద్ర వేసేస్తే ఎవరి మనో భావాలూ దెబ్బ తినవనుకుంటా. ఇప్పుడు ఉదాహరణకి హర్యాణాలో ఎవరో బిషప్ మీద అత్యాచార ఆరోపణలు వచ్చి రెండు నెలలు దాటినా ఇంకా పోలీసులూ అరెస్టు చెయ్యలేదంట. అదే హిందూ స్వామీజీ ఐతే పరిస్థితి వేరే విధంగా ఉండేది కదా. కాబట్టి ఆ బిషప్ ఒక కరడు గట్టిన హిందూత్వ వాది. మైనార్టీలకు చెడ్డపేరు తేవడానికి అలా బిషప్ గా మారి ఆ విధంగా చేశాడు అని చెప్పి మూసేస్తే ఇటు మైనార్టీల మనోభావాలు భంగపడవు. హిందువులకు ఎలాగూ అలవాటైపోయింది కాబట్టి ఇది పెద్ద విషయంకాదు.
ఏంటీ? ప్రతీది మరీ అసంబద్ధంగా గోరంతను కొండంతదిలా చేసి చూస్తున్నానా? ఉండండి, నేనుకూడా లౌకిక కళ్ళద్దాలు పెట్టేసుకుంటా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి