27, ఆగస్టు 2015, గురువారం

శుంఠ సంఘం-1

అది అఖిలభారత శుంఠ సంఘంలో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న ప్రదేశం. జెండా వందనం పూర్తయిన తరువాత శుంఠ సంఘం స్థానిక కార్యదర్శి అయిన శ్రీ సీమ శుంఠ గారు సభనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.

"నా ప్రియమైన శుంఠలారా, పెక్కు శతాబ్దముల పరతంత్ర పాలన తరువాత సముపార్జించిన స్వాతంత్ర్యం ఒక ఎత్తయితే, గుంటకాడ నక్కలా అవకాశం కోసం వేచిచూసే విదేశీ విద్రోహ శక్తుల బారిన తిరిగి పడకుండా మన స్వాతంత్ర్యాన్ని నిలుపుకోవడం మరొక ఎత్తని గ్రహించి, స్వతంత్ర భారత పరిరక్షణకై ఆ రోజుల్లోనే, అఖిల భారత శుంఠ సంఘం అనే నేటి మహా వృక్షానికి విత్తనం వేసిన కీ.శే. శ్రీ అపర శుంఠ గారిని స్మృతిలోనికి తెచ్చుకుంటూ ఈ రోజు మన సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన శుంఠ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీ పరమ శుంఠ గారిని సభనుద్దేశించి ప్రసంగించవలసినదిగా కోరుతున్నాను ." అని సీమ శుంఠ గారు ప్రక్కకకు తప్పుకున్నారు . పరమ శుంఠ పేరు వినగానే సభలోని వృద్ధ శుంఠలూ అలాగే అతని గురించి తెలిసిన కొందరు కుర్ర శుంఠల శరీరాలు ఒకవిధమైన భావావేశంతో బిగిసుకుపోయాయి. "పరమ శుంఠకీ..... జై.... పరమ శుంఠ నాయకత్వం ....... వర్ధిల్లాలి..." వంటి నినాదాలతో సభ మార్మోగిపోయింది.

సభికుల ఉత్సాహాన్ని చూసి సంతృప్తి చెందిన పరమ శుంఠ గారు తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. 

"సభలో వున్న శుంఠలన్దరికీ నమస్కారం. స్వతంత్ర భారతదేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న మార్పులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. పరిస్థితులు ఈ విధంగానే కొనసాగితే, గత 68 సంవత్సరాలుగా పరిరక్షించుకుంటూ వస్తున్న మన స్వాతంత్ర్యం ఇంకెంతో కాలం మనలేదన్న నిష్ఠుర సత్యాన్ని శుంఠలన్దరూ దర్శించవలసినదిగా కోరుకుంటున్నాను."

సభ మొత్తం గంభీరమైన వాతావరణం నెలకొంది. జెండా వందనం తరువాత పంచిన చాక్లెట్లను కూడా తినడం మరచిపోయి సభలో లీనమైపోయిన శుంఠలను చూసి పులకితుడైన శ్రీ పరమ శుంఠ గారు తమ ప్రసంగాన్ని కొనసాగించారు. 

" ఒక్కసారి 68 ఏళ్ళ మన స్వతంత్ర భారత చరిత్రను అవలోకిస్తే, మన స్వాతంత్ర్య పరిరక్షణలో మన నాయకులు చూపిన అవగాహనా మరియు దూరదృష్టి  న భూతో... అనవచ్చు. మనం ఏయే కారణాలవల్లైతే పరాయి పాలనకు గురయ్యామో గుర్తించి మళ్ళీ భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు సంభవించకుండా మన గత నాయకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారనటంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు. 

ఉదాహరణకి మనలో మనం కొట్టుకు చావడం వల్లనే విదేశీయులు మనల్ని జయించగలిగారన్న విషయం మీ అందరికీ  తెలుసు. అందుకే భవిష్యత్తులో అటువంటి గొడవలకు తావు లేకుండా "గాంధీ" అన్న రాజ వంశాన్ని సృష్టించి, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగి ఎవరు తన్నుకు చచ్చినా దేశాధికారం గాంధీల చేతుల్లో మత్రమే ఉండే విధంగా ఏర్పాటు చేయటం ద్వారా దేశ సమైక్యతనూ తద్వారా దేశ సమగ్రతనూ కాపాడారు. 

అలాగే విదేశీ వ్యాపారం ద్వారా మరలా వలసవాదులు రాకుండా, అవినీతీ , ఆశ్రిత పక్షపాతాలను పెంచి పోషిస్తూ, విదేశాలేం ఖర్మ, మన దేశీయులే మన దేశంలో వ్యాపారం చేయాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి సృష్టించారు. 

పెట్టుబడిదారులు మన దేశ సంపదకు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు, ఉచిత పథకాలు, కులాధారిత రిజర్వేషన్లూ, సమ్మెలూ, బందులూ  ప్రవేశపెట్టి ప్రజలను సోమరులను చేయడం ద్వారా దేశ సంపద పెరగకుండా తద్వారా విదేశీయుల కన్ను మన దేశంపై పడకుండా కాపాడుకున్నారు. ఏమిచ్చి మనం మన నాయకుల ఋణం తీర్చుకోగలం చెప్పండి?"

ఈ మాట చెబుతూ పరమ శుంఠ గారు కళ్ళు తుడుచుకున్నారు. సభలోని శుంఠలు శ్వాసించటం కూడా మరచిపోయి పరమ శుంఠగారి ఉపన్యాసం వింటున్నారు. పరమ శుంఠగారు మళ్ళీ కొనసాగించారు. 

" అంతేనా! మనకి నాగరికత నేర్పడానికని కదూ తెల్లవాళ్ళు మనకు స్వాతంత్ర్యం ఇవ్వకుండా తాత్సారం చేసింది. అందుకే ఎప్పుడు పుట్టిందో తెలీని మన సంస్కృతిని భ్రష్ట్టుపట్టించి, తినే తిండి నుంచి కట్టుకునే బట్టవరకూ, మాట్లాడే భాష నుండి పండుగలూ పబ్బాలూ వరకూ పాశ్చాత్య సంస్కృతినే అనుసరిస్తూ మనకు సంస్కృతి లేదన్నవారి నోళ్ళు మూయించారు.

పెద్ద భూభాగాలను రక్షించుకోవడం కష్టమని తలచి దేశాన్ని మూడు ముక్కలు చేయడమే కాకుండా, భవిష్యత్తులో కాశ్మీర్, అస్సాం , బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి సరిహద్దు రాష్ట్రాలను కూడా వేరుచేసి చక్కగా చిన్నగా మొండెంలా మిగిలిన చిన్న భాగాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవచ్చని మన నాయకుల దురాలోచన("దూరాలోచన" అని చదువుకోగలరు) కదూ!

అయితే ఇప్పుడేమి జరుగుతున్నది? 

దేశ నిర్మాణ సంబంధిత విషయాలలో రాష్ట్రాలకు అధిక ప్రాముఖ్యతట(నిటి ఆయోగ్),వివిధ దేశాలతో కనీవినీ ఎరుగని రీతిలో వాణిజ్య ఒప్పందాలట.
ప్రభుత్వ సంస్థలలో ప్రయివేటు సంస్థల భాగస్వామ్యమట, "మేక్ ఇన్ ఇండియా" అట; 
వేర్పటువాదులతో శాంతి ఒప్పందాలాట, "యోగా డే" అట. 
అసలు ఘనత వహించిన గాంధీ వంశము వారి చేతిలో అధికారము లేకపోవటం వల్ల వచ్చిన తంటా కదా ఇది. 

కాబట్టి, నా ప్రియమైన శుంఠలారా! ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గత ఆరు  దశాబ్దాలుగా మన దేశ సార్వభౌమత్వాన్ని సమర్ధవంతంగా నిలబెట్టిన మన నాయకుల విధానాలను పునరుద్ధరించి తద్వారా మన దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టడంలో మన శుంఠ సంఘం పోషించవలసిన కీలక భూమిక ఏమిటంటే..... "

పరమ శుంఠ గారు వాక్యము పూర్తి చేసేంతలో మధ్యాహ్న  భోజనం సిద్ధం అయ్యిందన్న వార్తా దావానలంలా సభలో వ్యాపించటంతో సభలోని శుంఠలందరూ ఒకరినొకరు తొక్కుకుంటూ భోజనశాల వైపు బిలబిలమంటూ పరుగు తీసారు. 

వేదికపై పరమ శుంఠగారు మాత్రం దిక్కులు చూస్తూ మిగిలిపోయారు. 


(భావి భారత నిర్మాణంలో శుంఠ సంఘం ఎటువంటి భూమిక పోషించనుందో మున్ముందు చూద్దాం.)

18, జులై 2015, శనివారం

తెలుగు పాఠ్యపుస్తకాలతో నా పయనం

హ్మ్...... ఎక్కడి నుండి మొదలెట్టాలి?

"చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ ....... "నా  లేకపోతే  "బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెల్తివి....."నా లేక మరొకటా.

చిన్నప్పుడు, ఏ తరగతిలోనో గుర్తులేదు, చిలకమ్మ పెండ్లి అని ఒక గేయం వుండేది. అందులో చిలకా గోరింకల పెళ్ళిని అడవిలో గల జంతువులన్నీ వచ్చి జరిపిస్తాయి. గేయం గుర్తు లేదు గానీ, ఆ గేయం చదివిన అనుభవం గుర్తుంది. పుస్తకంలో ఆ గేయం చుట్టూ ముద్రించిన అల్లుకుపోయిన అడవి బొమ్మ అందులో చాలా జంతువులూ పక్షుల బొమ్మలతో చాల నిండుగా వుండేది ఆ పుట.

ఇక జగత్ప్రసిద్దమైన పులి-బంగారు కడియం పాఠంలో బాటసారికి మెరుస్తున్న బంగారు కడియాన్ని చూపిస్తున్న టక్కరి పులి బొమ్మ, వామ్మో  పులి!! అనుకునేలా చేసింది.  కాకి-నక్క పాఠం చదివిన తరువాత రెంటికీ బుద్ధిలేదని అనిపించింది. అవును. కుందేలు-తాబేలు పాఠంలో తాబేలు గెలుపు ఎందుకో అంతగా రుచించలేదు. ఎంత పొగరుమోత్తనం ఉన్నప్పటికీ పరుగుపందెం మధ్యలో కుందేలు ఎందుకు పడుకుంటుందీ? ఎవరో కావాలనే అసలు కథని మార్చి రాసేసారని నా భావన. ఇంక  పులి-ఆవు కథకు వస్తే మూడు బొమ్మలుండేవనుకుంటా ఈ పాఠంలో. ఈ పాఠంలో పులి ఆవు తెగ నచ్చేసాయి నాకైతే. మూడు చేపల కథ పాఠం ఎంతబాగుండేదని!దాదాపుగా విష్ణుశర్మ పంచతంత్ర కథలు ఒక్కటైనా సరే ప్రతీ తరగతిలోనూ పాఠ్యాంశంగా వుండేవి. 

"ఆబ్బబ్బ నాయెత్తు ఆకాశమంత ...." అంటూ మఱ్ఱి విత్తనాన్ని గేలిచేసిన తాటిచెట్టు చివరికి అదే మఱ్ఱి చెట్టు నీడలో నశించిపోవడం, మఱ్ఱిచెట్టు తాటిచెట్ల బొమ్మలు ఉన్న తాటిచెట్టు పాఠం జీవితాంతం గుర్తుంచుకోవలసిన ఆణిముత్యం అని అప్పుడు తెలియలేదు సుమీ. తండ్రి చనిపోయిన తరువాత తమకు మిగిలిన చెట్టు, ఆవు, కంబలిలను తెలివిగా తనకి లాభం చేకూర్చేలా పంపకాలు చేసుకున్న అన్న, తమ్ముడి భార్య తెలివితేటలతో కొట్టిన దెబ్బకి దారికి రావటం చూసిన తరవాత, పాపం భార్య లేకపొతే ఆ అమాయక తమ్ముడి పరిస్థితి ఏమయ్యేదో అని జాలేసింది. ఇక పరస్పర సాయాన్ని గురించి చెప్పే పావురం-చీమ పాఠం గురించి చెప్పుకోవాలీ....ఈ కథ ప్రేరణతో నేను చీమలను కావాలని నీటిలో పడేసి పక్కన ఆకు కూడా వేసేవాడ్ని, అవి ఎలాగా ఎక్కుతాయా అని చూడ్డానికి. నాకు గుర్తున్నన్తవరకూ అవి చాలా సులభంగా ఈదుకొని ఒడ్డుకి వచినట్టు గుర్తు, నేను వేసిన ఆకుకి కనీసం గౌరవం కుడా ఇవ్వకుండా...హు ఏంచేస్తాం. 

ఐదవ తరగతిలో తరగని చెట్టు అనే పాఠం వుండేది. పొదుపు యొక్క ఆవశ్యకతను తెలిపే ఇద్దరు చైనా మిత్రుల కథ ఇది. ఈ కథలోని చింతచెట్టు ఆకుల వలె మనం క్రమ శిక్షణతో చేసిన పొదుపు అనేది నిరంతరం పెరుగుతూనే వుంటుంది గానీ దానికి తరుగుదల వుండదని ఈ కథ సారాంశం. ఇద్దరు చైనా మిత్రులూ ఎదురెదురుగా నుంచునే బొమ్మ వుండేదనుకుంటాను ఈ పాఠంలో. ఇదే తరగతిలో పులినే బోల్తా కొట్టించిన పేదరాసి పెద్దమ్మ కథ కూడా వుండేది. గుమ్మడి బానలో కూర్చొని పేదరాసి పెద్దమ్మ అడవిలో దొర్లుకొని పోవటం, నోట్లో ఇసుక పెట్టుకొని దాన్ని పులి కళ్ళలోకి ఊదటం ద్వారా దాని బారినుంచి తప్పించుకోవటం భలే గమ్మత్తుగా వుండేది చదువుతుంటే. బానలో అడవిగుండా దొర్లుతున్న పేదరాసి పెద్దమ్మ బొమ్మ నాకు బాగా గుర్తుంది.

ఇక తరువాతి తరగతులనుంచి మాకు తెలుగులో ఉపవాచాకాలు కుడా ప్రారంభం అయ్యాయి. సర్ ఆర్థర్ కాటన్ దొర జీవితం, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహనీయుల జీవితాలు పరిచయం చేయబడ్డాయి వాటిలో మాకు. అలాగే పదవ తరగతి ఉపవాచక పుస్తకం అట్టపై పంచెకట్టు, పైన ఓవరు కోటు, దొరల టోపీ అలాగే  చేతిలో గొడుగుతో కనిపించే  బారిస్టరు పార్వతీశం పదవ తరగతి ఆసాంతం కడుపుబ్బ నవ్వించినా, ఒక్కొక్కప్పుడు అంత అమాయకత్వంతో ఎలా నెట్టుకొస్తాడో అని గుబులేసేది. 

ఇక  ప్రతి తరగతిలో భేతాలుడిలాగా వెంటబడే సుభాషితరత్నాల గురించి చెప్పుకోవాలి. "ఉప్పు కప్పురంబు ...." అంటూ మొదలైన వేమన శతకం , "వినదగునెవ్వరు చెప్పిన..." అంటూ మొదలైన సుమతీ శతకం , "ఆరంభింపరు నీచమానవులు....." అంటూ గడ్డిపెట్టిన భర్తృహరి సుభాషితాలు , "వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు..." అని బోధించిన తెలుగుబాల శతకం ఇంకా అలాగే మధ్యమధ్యలో చుట్టాల్లా వచ్చే కుమార, నృసింహ, కాళహస్తీశ్వర శతకాలు మొదట్లో తెగ ఇబ్బంది పెట్టినా లోకజ్ఞానం రూపుదిద్దుకొంటున్నకొద్దీ వాటిపై వల్లమాలిన అభిమానం పెరిగిపోయింది. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పద్యాలను రాగయుక్తంగా పాడుకోనేవాడిని. (ఈ అలవాటు ఇప్పటికీ ఉందండోయ్)

పాత రోజుల గొప్పతనాన్ని వివరించే రష్యా కథ "గోధుమ గింజ"; బాల్య వివాహపు దుష్ప్రభావాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే గురజాడ వారి" పూర్ణమ్మ" గేయం మరియు ఆ పాఠంలో దుర్గ గుడి పక్కన కొలను దగ్గర పూలసజ్జతో పూర్ణమ్మ బొమ్మ...అనవసరంగా చనిపోయిన పూర్ణమ్మ గురించి ఎక్కడో బాధ, ఆ ముసలి పెళ్లికొడుకుపై అసహ్యం; చీమల్లో గూండా చీమలు కూడా ఉంటాయా? అని విస్మయపరచిన "చీమతల్లి విశ్వాసం"; ఒక్కపెట్టున బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చిన శ్రీశ్రీ గారి "శైశవ గీతి" అబ్బో ఇవన్నీ ఒక పట్టాన స్థిమితంగా ఉండనిచ్చేవి కావు.

"కళ్యాణకటకమను పట్టణమున భైరవుండను వ్యాధుడుండెడివాడు...... " అంటూ శుద్ధ గ్రాంధికంలో వుండే "దురాశ" పాఠంలో నక్క ప్రదర్శించిన లక్షణాన్ని దురాశ అంటారంటే మొదట్లో నాకు భావ్యం అనిపించలేదు. "బాల్యోపచారాలు" లో బెజ్జమహాదేవి శివునికి చేసిన సేవలు, "శ్రీ కృష్ణ లీలలు" లో బాల కృష్ణుని ఆగడాలూ, "ప్రవరుని స్వగతం " లోని "అటంజని కాంచె భూమిసురడంబరఛుంబి .... " అంటూ సాగే ప్రాసయుక్తమైన పద్యాలూ, ఒక "జడివాన ", ఒక "మాతృ హృదయం", ఒక "తామసి", ఒక "బొండు మల్లెలు ", ఒక " బుడుగు" ఓరి బాబోయ్ ఒక జీవితంలో ఎన్ని కోణాలు, ఎన్ని అనుభవాలు! గోపీచంద్ "మాకూ వున్నాయి స్వగతాలు" నుంచి గ్రహించిన "తుమ్మచెట్టు" పాఠంలో తుమ్మచెట్టు తన అనుభవాలు చెబుతున్నప్పుడు నాకేమాత్రం అనుమానం కలుగలేదు సుమీ. మా వూర్లో ఎక్కడపడితే అక్కడ కనిపించే మా తుమ్మచెట్లకు స్వర్ణపుష్పి అన్న అందమైన పేరుందని తెలిసిన తరువాతే కదా బంగారు రంగు పూవులతో ఆర్భాటం లేకుండా గమ్మునుండే మా స్వర్ణపుష్పి సౌందర్యాన్ని చూడగలిగింది. 

మొత్తానికి ఈ పాఠాలన్నీ అప్పట్లో చాలావరకూ పరీక్షల కొఱకే చదివినా,  జీవితంలో ముందుకు పోతున్నకొద్దీ ఎప్పటికప్పుడు క్రొంగొత్త సవాళ్ళను విసురుతున్న రేపటిని ధైర్యంగా ఎదుర్కోవడానికీ, నా పయనం యొక్క గమ్యంపై స్పష్టత గురించీ నాకు కావలసిన ప్రేరణని ఎక్కడో సుప్తచేతనంలో జీర్ణిచుకుపోయిన ఈ పాఠాలే ఇస్తున్నాయేమొనని నా నమ్మకం. 


ఇదండీ తెలుగు పాఠ్యపుస్తకాలతో నా పయనం. ఇందులో నేను గుర్తు తెచ్చుకోగలిగిన పాఠ్యంశాలను మాత్రమే ఉటంకించడం జరిగింది. వాస్తవానికి ప్రతీ పాఠమూ నాకు బాహ్య స్మృతిలో గుర్తున్నా లేకున్నా, అది నాకు అభిమానపాత్రం మరియు గురుతుల్యం. ఒకవేళ మీకు ఏమైనా గుర్తుంటే వాటి పేర్లను వ్యాఖ్యలలో ఉటంకించగలరు. 

సమాప్తం. 


24, జూన్ 2015, బుధవారం

పికిలి

(  ఈ కథ చాల సంవత్సరాల క్రితం ఈనాడు వారపత్రికలో చదివాను. నన్నెంతో కదిలించిందీ కథ. అందుకే ఆ ఈనాడు వారపత్రిని చాలా సంవత్సరాలు భద్రంగా దాచుకున్నాను. కానీ ఎలా పోయిందో? మొత్తానికి ఈ మధ్య ఆ కథ గుర్తొచ్చి అంతర్జాలంలో వెతికితే ఆ కథ అంగ్లపు అనువాదం క్రింద ఇచ్చిన లింకులో కనపడింది. దానికి తెలుగు అనువాదం ఇక్కడ చేసాను. రచయిత పేరు శ్రీ పాపినేని శివ శంకర్ గారు. ఇంత హృద్యమైన కథని సృష్టించినన్దుకు వారికి నేను సదా ఋణపడి ఉన్నాను.
ఆంగ్ల అనువాదపు లింక్   http://creative.sulekha.com/the-last-sparrow_75338_blog)



పిచ్చుకలకు  కూడా జీవితం ఉంటుంది.

ఈ విశాల ప్రపంచంలో వాటికి  కూడా స్థానం వుంది. 

నేనొక గూడులేని చిన్న పిచ్చుకని. నా కథని చదవండి. 

"అనగనగనగా ఒకానొక అడవిలో ఒక చెట్టుపై ఒక కాకి, పిచ్చుక గూళ్ళు కట్టుకొని నివసిస్తుండేవి. కాకిది కొమ్మలతో చేసిన గూడైతే పిచ్చుకది మట్టి గూడు. ఒకానొకరోజు కురిసిన భీకరమైన గాలివానకి పిచ్చుకమ్మ మట్టిగూడు  చెదిరిపోతుంది. 

అప్పుడు పిచ్చుక కాకి గూటికి వెళ్ళి "కాకమ్మా , కాకమ్మా, నా గూడు పడిపోయింది కాస్త నీ గూటిలో చోటివ్వవా?" అని అడుగుతుంది. 

కాకి  "అయ్యో! ఇప్పుడు నేను మా పిల్లకి స్నానం చేయిస్తున్నాను. కుదరదు పో ." అంది. 

కాసేపాగి పిచ్చుక మళ్లీ కాకి గూటి దగ్గరకు వెళ్లి "కాకమ్మా, కాకమ్మా, ఇప్పటికైనా నీ గూటి తలుపుతీయవా?" అని అడుగుతుంది. 

కాకి " నేనిప్పుడు మా పిల్లకి భోజనం పెడుతున్నాను, కుదరదు పో ." అంది. 

పిచ్చుకమ్మ ఏడ్చుకుంటూ వెళ్లి మట్టిని తవ్వడం ప్రారంభించింది. చిన్న బంగారం దొరికింది. అప్పుడు పిచ్చుక మట్టిని ఇంకా ఎక్కువ తవ్వింది. పెద్ద బంగారం దొరికింది. పిచ్చుకమ్మ ఆ బంగారంతో మంచి మేడిల్లు కట్టుకొని సంతోషంగా జీవించింది. 

పిచ్చుకమ్మ అదృష్టాన్ని చూసి కన్నుకుట్టిన కాకమ్మ కూడా మట్టిని తవ్వడానికి బయలుదేరింది. చిన్న మట్టిని తవ్వింది. చిన్న తేలు కుట్టింది. పెద్ద మట్టిని తవ్వింది. ఈసారి పెద్ద తేలు కుట్టింది. మట్టి కడుక్కోవడానికి నది దగ్గరకు వెళ్లి నదిలో జారిపడి కొట్టుకుపోయింది. "

వెన్నెల రాత్రుల్లో తమ పిల్లల్ని నిద్రపుచ్చడానికి తల్లులు చెప్పే కథ యిది. వెచ్చని అమ్మ రెక్కల్లో ఒదిగిపోయి నేనీకథను చాలాసార్లు తను చెబుతుంటే విన్నాను. నిజమేనేమో అనిపించే కల్పిత కథ. 

కానీ కాకమ్మలు ఎప్పుడూ  వాటి గూటి తలుపులు తెరిచే ఉంచుతాయి. ఎటొచ్చీ  తలుపులు మూసుకునేది ఈ రెండు చేతుల జీవులు మాత్రమే. 

అమ్మ చనిపోయిన తరువాత, గూడు లేని పిచ్చుక జీవితం ఎంత దుర్భరమో తెలిసివచ్చింది. ఎండా వానలనుంచి ఎక్కడ నేను తలదాచుకొనేది?

అయినా ఒంటరి బ్రతుకు కాస్త భిన్నంగా వుండేది. ఎక్కడెక్కడో పచ్చని చెట్లు, ఇండ్ల తాటాకు చూరులు, మండువా లోగిళ్ళు అన్నీ నావే. 

కానీ పికిలి నా జీవితంలోకి వచ్చాక, మాకంటూ ఒక సొంత గూడు అవసరమొచ్చింది. గుడ్లు పెట్టి పొదగడానికి ఒక గూడు కావాలి. "నది పక్కన వున్న చెట్టుపై గూడు కట్టుకుందాం. " పికిలి అన్నాది ఒకరోజు.  పాపం పికిలి,  గూళ్ళను పంటచేలకు  లేదా ఇండ్లకు దగ్గరలో కట్టుకోవాలని తెలీదు. మరి పండిన పంటలు వుండేది ఆ చోట్లలోనే కదా. 

గూడు కట్టడానికి పనికివచ్చే మెత్తని గడ్డిపరకలను ఎలా ఎంచుకోవాలో మా అమ్మ నాకు నేర్పింది. గూడు కట్టడం మగ పిచ్చుకలు మాత్రమే చేయాలనీ, అది ఒక కళ అనీ, మగ పిచ్చుకలు గూడు కట్టే నైపుణ్యం చూసే ఆడవి జతకడతాయని అమ్మ చెబుతుండేది. కానీ మా పిచ్చుకలు ఆ గిజిగాడిలాగా మాత్రం గూడు కట్టలేవంట!

ఒక పెద్ద పాత  ఇంటిని చూశాను. ఒక మూలగా ఇంటి పైకప్పుకి ఆధారంగా వున్న చెక్క దూలాల మధ్య ఒక స్థలాన్ని ఎంచుకున్నాను. ఇక్కడైతే ఎండా, వానా పెద్దగా ఇబ్బంది పెట్టవు. చుట్టుపక్కల తిరిగి మెత్తని గడ్డిపోచలు ఏరి మూడురోజుల్లో గూడు కట్టడం పూర్తి చేశాను. పికిలి రేపో మాపో మొదటి గుడ్డు పెట్టేటట్టే వుంది.

"మన గూడు  చాలా మెత్తగా వెచ్చగా వుంది" , సగం ఎండిన లేత గడ్డిపరకలను చూస్తూ అంది పికిలి. "నేనంటే నీకు చాలా ప్రేమ కదూ.." అడిగిందోసారి , నా మొఖంపై చక్కిలిగింతలు పెడుతూ. నా కళ్ల క్రిందన వుండే తెల్లని మచ్చంటే తనకెంతో ఇష్టం. తనకంటే నేనే  అందంగా వున్నానంటుది. 

పికిలి మూడు గుడ్లు పెట్టింది. అవి పొదగబడేవరకు ఎంతో ఉద్వేగం! మాకసలు కంటిమీద కునుకు పట్టలేదు. మరి నేనొక్కడినే వెళ్లి ఆహారం తేవాలి. పాములు, పిల్లుల నుంచి రక్షించుకోవాలి . మూడు గుడ్లలో రెండు పొదగబడ్డాయి. నునులేత గులాబీ రంగు ముక్కులతో, పల్చని రెక్కలతో ఎంత ముద్దొస్తున్నాయో! నేను వాటికీ చిన్న చిన్న పురుగులు, గింజలు పెట్టేవాడిని. మేము వాటికి వాటి కాళ్లపై నిలబడి ఎలా గెంతాలో అలాగే ఎలా ఎగరాలో నేర్పించేవారం. 

కానీ ఈ ఆనందం ఎంతో  కాలం  నిలువలేదు. ఒకరోజు మేము యధావిధిగా  గూటికి తిరిగి వచ్చేటప్పటికి మా పిల్లలు గూట్లో లేరు. ఆ రెండు చేతుల జీవి మా గూటిని కుళ్లబొడిచి అవతల పారేశాడు. తన ఇంటికి  మరమ్మత్తులు చేయిస్తున్నాడంట. మా పిల్లలు ఏ  పిల్లినోటిన పడ్డాయో ఏమో? మాకెప్పటికీ  తెలియదు. ఎంత బాధపడ్డామో?

ఈ ద్వేషంతో కలహించుకొనే  రెండు చేతుల జీవులు, పెద్ద పక్షులు, అలాగే పక్షులకోసం వలలు పన్నే వేటగాళ్ళ మధ్య మా చిన్న పిచ్చుకల గోడు ఎవరికి పడుతుంది? మా తోటి పిచ్చుకలు వచ్చి ఓదార్చాయి. 

కొన్నిరోజులు పొదలు, ముళ్ళ తుప్పలే మా నివాసం. ఉండటానికి తగిన ప్రదేశమేదీ? ఆఖరికి ఒక ఇంటి ముందరున్న ఒక లోతైన బావిని కనుగున్నాను. నీరు చాల లోతుగా వుంది. ఆ బావి గోడ సగం వరకు రాళ్ళతో కట్టబడి వుంది. ఆ రాళ్ళ గోడలో ఒక మూల మా గూటిని ఏర్పాటు చేసుకున్నాము. 

నూతిలో వుండే గూడుకి గల ప్రమదాలగురించి అమ్మ చెబుతూ వుండేది. నూతిలోని వెచ్చదనం హెచ్చుతగ్గులు, మునుపటి వర్షాకాలంలో నీటిమట్టం చూసుకోవాలి. రెక్కలు రాని పిల్లలు నూతిలోకి జారిపడే ప్రమాదం వుంది. కాకపోతే ఇక్కడ ఇతర ప్రాణులనుంచి పెద్దగా అపాయం ఉండదు. 

మా బాధను క్రమంగా మరచిపోయాము. పికిలి నేను ఎన్నో సాయంత్రాలు ఆ బావి గట్టుపై గడిపేవారం. నీటిలో తడిసి రెక్కలను అరబెట్టుకునేవారం. నూతిలో నీరు తోడుకోవడానికి చేదలు పడేసేటప్పుడు మాత్రం భయం వేసేది. వాళ్ళు నీళ్లు తోడుకుంటున్నప్పుడు చేదల అంచులపై వాలి అక్కడినుంచి తిరిగి గూట్లోకి ఎగిరిపోయేవాళ్ళం. ఎంత ఆనందంగా ఉండేదో!

పికిలి మళ్లీ పిల్లల్ని చేసింది. ఆ ఏడు  వానలు లేవు. నీటికోసం మా గొంతుకలు ఎండిపొయేవి. ఒకరోజు ఉన్నట్టుండి పెద్ద మట్టి పెళ్లలు పైనుంచి నూతిలో పడ్డాయి. ఆ రెండు చేతుల జీవులు నూతిని మట్టితో కప్పేసాయి. మేము ఎగిరి ప్రాణాలను కాపాడుకున్నాం. ఎగరడం ఇంకా రాని మా పిల్లలు ఆ నూతిలోనే భుస్థాపితమైపోయాయి. మళ్లీ మా జీవితాలలో  నిరాశ, నిస్పృహ, నిరాశ్రయం. 

రోజులు ఎంత త్వరగా మరిపోతున్నాయో! ఎక్కడో  కాలువ గట్లలో చిన్న చిన్న చేపలు తప్ప అసలు ఆహారం దొరకటం కష్టమైపోయింది. పురుగులు కూడా దొరకటం లేదు. ఇదివరకటి పంటలు ఎక్కడా కనిపించటంలేదు. గింజలు లేని ఏవేవో పంటలు, వాటిని అపురూపంగా తడుముతూ, సంరక్షిస్తూ ఆ రెండు చేతుల జీవులూ. 

"బంగారుకాలం పోయింది పికిలి " ఒకరోజు పికిలితో అన్నాను నేను. నేను చిన్నప్పుడు అమ్మ నన్ను పచ్చని పైర్లవెంట తీసుకెళ్ళేది. అప్పటి గాలి ఎంత స్వచ్చంగా గమ్మత్తుగా ఉండేదో! అస్సలు అలుపనేది లేకుండా మైళ్లకు మైళ్లు ఎగురుకుంటూపోయేవాళ్ళం. జొన్న, రాగి, సజ్జలు, వరి , ఇక్కడో రెండు గింజలు, అక్కడో మూడు గింజలు తింటూ అలా మైళ్ల దూరాలు కలిసి ప్రయాణించేవారం.  

మొత్తం సృష్టిలో ఈ మనుషులకు మాత్రమే రెండు చేతులున్నాయంట, అమ్మ చెప్పింది. ఆ చేతులతో వాళ్ళు చెట్లను నరుకుతారు, జంతువులను పక్షులను వేటాడుతారు, అసహజమైన పంటలను పండిస్తారు అలాగే జంతువులను మచ్చిక చేసుకొని వాటితో పని మొత్తం చేయించుకుంటారంట. ఈ ప్రపంచంలో వున్నవన్నీ తమకే కావాలని స్వార్థం అంట వాళ్ళకి.

ఏదో ఒక రోజు ఈ రెండు చేతుల జీవుల వల్ల మన పిచ్చుకలు కనుమరుగైపోతాయేమోనని అమ్మ భయపడుతుండేది. 

ఒకరోజు, మా అమ్మ నిద్రలో వున్నప్పుడు, నా  రెక్కలకు పనిచెప్పా. చల్లని పిల్లతెమ్మెరకి అలా ఎగురుతుంటే ఎంత హాయిగా అనిపించిందో! అలా ఎగురుకుంటూ వెళ్లి ఒక పచ్చని పైరు చూశాను. నిజం చెప్పొద్దూ! జొన్న కంకులు విరగబడి కాసాయి  ఆ పైరులో. ఘుమ్మనిపించే వాసన. కానీ జొన్న కంకులపై చాలా జాగ్రత్తగా వాలాలి. లేకపోతే ఆకులు  గీసుకొనే ప్రమాదం వుంది. 

దగ్గరలో ఎవరూ  లేరని చూసుకుని అలా  అదాటున ఒక కంకిపై వాలానో లేదో, "ఎంటా  తొందర? మెల్లగా.." అని జొన్న కంకి అనటం వినిపించింది. అప్పుడు నేనన్నాను " నీకేమమ్మా, ఒక్కదగ్గిరే వుంటావు, నాకలా కాదుగా, ఎక్కడెక్కడో తిరగాలి ఆహారం కోసం." అని. 

"రెండు వారాలనుంచి వర్షం లేదు. భూమి లోతులో కూడా తడి పొడ లేదు. నా గింజలు కట్టవేమో." దిగులుగా అన్నది జొన్న కంకి. 

"మరైతే ఇంకో చోటికి వెల్లిపోనా?" అడిగాను నేను. 

"లేదు లేదు, నువ్వు నా  బిడ్డలాంటిదానివి, ఎంతసేపైనా కూర్చో. కానీ నాపై రెట్ట మాత్రం వెయ్యకేం" అని అన్నది జొన్న కంకి. 

"సంతోషంతో ఒక లేత గింజను పొడుస్తూ  కంకిని అడిగాను "మరి నీకు నొప్పెట్టదా మేమిలా పొడుస్తుంటే?"

జొన్న కంకి తెరలు తెరలుగా నవ్వింది. "బిడ్డ చన్ను కుడుస్తుంటే తల్లి ఎలా ఆనందపడుతుంది? మీరు నన్ను గింజలకోసం పొడుస్తుంటే నాకలాంటి ఆనందం." అంది. 

వరి పైర్లు, జొన్న పైర్లపై ఎగరటం, దున్నపోతుల కొమ్ములపై వాలటం ... అవన్నీ బంగారు రోజులు. చిన్నప్పుడు ప్రతి ఇంటిముందు వరికంకులు వ్రేలాడగట్టేవారు పక్షులకోసం. ఇప్పుడు అలాంటి పంటలు గానీ అలవాట్లు గానీ మిగల్లేదు. గింజలు లేవు, ఆహరం లేదు. మిగిలిందల్లా ఎడతెగని  ఆహారాన్వేషణ మత్రమే. 

పికిలి, నేనూ ఈ రెండు చేతుల జీవుల సమీపంలో నివసించకూడదని నిర్ణయించుకున్నాం. నదిగట్టున చెట్టుపై గూడు కట్టుకున్నాం. 

ఒకరోజు మేము గూడు కట్టుకున్న చెట్టు అన్నాది, " పిచ్చుకమ్మా, కాలంలో మార్పును గమనించావా? నేను పొడుగైనదానను. వందలకొద్దీ చెట్లను చూస్తున్నాను. ఎక్కడా పిచ్చుకలు కనిపించటంలేదు. ఒకప్పుడు బోలెడు పిచ్చుకలు వచ్చి నాపై సేదదీరేవి. బహుశ నువ్వే నీ జాతిలో చివరిదానివేమో? మీ జాతిని కాపాడుకో. "

నాకు భయంతో ఒళ్లు కంపించింది. నిజమే! ఈ మధ్యకాలంలో తోటి పిచ్చుకలు కనిపించటంలేదు. అందరూ పోయి నేనూ పికిలి మాత్రమే మిగిలినట్టుంది. కాలం ఎంత త్వరగా మారిపోతోంది!

పికిలి మళ్లీ గుడ్లు పెట్టడానికి సిద్ధమయ్యింది. నేనే ఆహారంకోసం వెతకాలి. కానీ ఎక్కడని వెతకను? కనీసం నీళ్ళు కూడా దొరకటం కష్టం ఐపోయింది. ప్రత్తి, మిరప పైర్లలో వెతికితే పురుగుల మందు తిని చనిపోయిన పురుగులు కనిపించాయి. ఆకలికి తట్టుకోలేక నేను కొన్ని తిని మిగిలినవి పికిలికి పట్టుకెళ్ళాను. 

ఎందుకు పురుగులు అదొక రకమైన రకమైన వాసనొస్తున్నాయని పికిలి అడిగితే  చెప్పాను. మారుమాట్లాడకుండా ఆ రుచి పచి లేని పురుగుల్ని తిన్నాది. 

పికిలికి అదే చివరి రాత్రి. 

నాది మొండి ప్రాణం. 

ఇప్పుడు నా పక్కన పికిలి లేదు. బంధువులూ, స్నేహితులూ లేరు. మేఘాల్లో ఎగురుతున్నప్పుడు పలకరించే వారు లేరు. ఇది ఎడారి. ఇది పిచ్చులకి తగిన చోటు కాదు. ఇలాంటి చోటు కేవలం రెండు చేతుల జీవులకు మాత్రమే. 

చివరికి నా రోజు వచ్చింది. ఎక్కడైతే నెలకి  రెండు వర్షాలు పడతాయో, పెద్ద అడవులుంటాయో, పురుగుల మందులు లేని పంట పొలాలుంటాయో, ఎక్కడైతే భూమాత వేనవేల పిచ్చుకల రెట్టలతో పునీతమౌతుందో, ఎక్కడైతే ఈ రెండు చేతుల జీవులకు స్థానం లేదో,   అక్కడికి ఎగిరిపోయే రోజొచ్చేసింది. 

పిచ్చుక జాతి నాతో అంతరిస్తోంది. 

పిచ్చుకలు లేని ఈ ప్రపంచం ఒక ఎడారిగా మారుగాక. ప్రకృతిని నాశనం చేస్తూ ఈ రెండు చేతుల జీవులు తమను తామే నాశనం చేసుకొందురుగాక. 

ఇది నా శాపం. ఒక చివరి పిచ్చుక యొక్క శాపం. 

ఒక్కసారి, ఒకేఒక్కసారి...నాలో వున్న శక్తినన్తటినీ కూడదీసుకుని ఆకాశం వైపుకు ఎగిరాను. 



















31, మార్చి 2015, మంగళవారం

శైశవగీతి

శైశవగీతి -శ్రీ శ్రీ

పాపం, పుణ్యం , ప్రపంచమార్గం -
కష్టం ,సౌఖ్యం ,శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా ,
అయిదారేడుల పాపల్లారా !
                    మెరుపు మెరిస్తే,
                    వానకురిస్తే,
                    ఆకసమున హరివిల్లు విరిస్తే
                    అవి మీకే అని ఆనందించే
                    కూనల్లారా!
అచ్చటి కిచ్చటి కనుకోకుండా
ఎచ్చ  టెచటికో ఎగురుతుపోయే,
పిట్టల్లారా!
పిల్లల్లారా!
                    గరికిపచ్చ మైదానాల్లోనూ,
                    తామరపూవుల కోనేరులలో,
                    పంటచేలలో, బొమ్మరిళ్లలో,
                    తండ్రి  సందిటా, తల్లి కౌగిటా,
                    దేహాధూళితో, కచభారంతో ,
                    నొళుల వ్రేళులు , పాలబుగ్గలూ ,
                    ఎక్కడ చూస్తే అక్కడ మీరై
                    విశ్వరూపమున విహరిస్తుండే
                    పరమాత్ములు
                    ఓ చిరుతల్లారా!
మీదే మీదే సమస్త విశ్వం
మీరే లోకపు భాగ్యవిధాతలు
మీ హాసంలో మెరుగులు తీరును
వచ్చేనాళ్ళ విభాప్రభాతములు
ఋతువుల రాణి వసంతకాలం
మంత్రకవాటం తెరుచుకునీ,
కంచు వృషభముల అగ్ని శ్వాసం
క్రక్కే గ్రీష్మం కదలాడీ,
ఏళ్ళు, బయళ్ళూ, ఊళ్లూ, బీళ్ళూ
ఏకంచేసే వర్షాకాలం,
స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు ,
హిమనీ నిబిడ్డ   హేమంతములు
చలి వణికించే శైశిర కాలం
వస్తూ పోతూ దాగుడు మూతల
క్రీడలాడుతవి మీ నిమిత్తమే!
ఇవాళలాగే ఎప్పుడు కూడా
ఇనబింబం పయనించు నింగిపై
ఎప్పుడు కూడా ఇవాళలాగే
గాలులు వీచును, పూవులు పూచును
నాకు కనంబడు నానాతారక,
లనేక వర్ణా, లనంత రోచులు
దిక్కుదిక్కులా దివ్యగీతములు
మీరూ వీటికి వారసులే! ఇవి
మీలో కుడా మిలమిలలాడును!
                    నా గత శైశవ రాగమాలికల
                    ప్రతిధ్వనులకై ,
                    పోయిన బాల్యపు చెరిగిన పదముల
                    చిహ్నాల కోసం ,
                    ఒంటరిగా కూర్చిండి ఊరుపులు
                    కదిలే గాలికి కబళము నిస్తూ
                    ప్రమాద వీణలు కమాచి పాడగ
                    సెలయేళ్ళను లాలిస్తూ,
                   పాతాళానికి పల్టీకొట్టీ
                   వైతరణీ నది లోతులు చూస్తూ,
                   శాంతములే, కే కాoతముగా, ది
                   గ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ,
                   మెటిక విరుస్తూ ఇట కుర్చుండిన
                   నను చూస్తుంటే నవ్వొస్తోందా?
ఉడతల్లారా!
బుడతల్లారా!
ఇది నా గీతం, వింటారా?