అది అఖిలభారత శుంఠ సంఘంలో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న ప్రదేశం. జెండా వందనం పూర్తయిన తరువాత శుంఠ సంఘం స్థానిక కార్యదర్శి అయిన శ్రీ సీమ శుంఠ గారు సభనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
"నా ప్రియమైన శుంఠలారా, పెక్కు శతాబ్దముల పరతంత్ర పాలన తరువాత సముపార్జించిన స్వాతంత్ర్యం ఒక ఎత్తయితే, గుంటకాడ నక్కలా అవకాశం కోసం వేచిచూసే విదేశీ విద్రోహ శక్తుల బారిన తిరిగి పడకుండా మన స్వాతంత్ర్యాన్ని నిలుపుకోవడం మరొక ఎత్తని గ్రహించి, స్వతంత్ర భారత పరిరక్షణకై ఆ రోజుల్లోనే, అఖిల భారత శుంఠ సంఘం అనే నేటి మహా వృక్షానికి విత్తనం వేసిన కీ.శే. శ్రీ అపర శుంఠ గారిని స్మృతిలోనికి తెచ్చుకుంటూ ఈ రోజు మన సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన శుంఠ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీ పరమ శుంఠ గారిని సభనుద్దేశించి ప్రసంగించవలసినదిగా కోరుతున్నాను ." అని సీమ శుంఠ గారు ప్రక్కకకు తప్పుకున్నారు . పరమ శుంఠ పేరు వినగానే సభలోని వృద్ధ శుంఠలూ అలాగే అతని గురించి తెలిసిన కొందరు కుర్ర శుంఠల శరీరాలు ఒకవిధమైన భావావేశంతో బిగిసుకుపోయాయి. "పరమ శుంఠకీ..... జై.... పరమ శుంఠ నాయకత్వం ....... వర్ధిల్లాలి..." వంటి నినాదాలతో సభ మార్మోగిపోయింది.
సభికుల ఉత్సాహాన్ని చూసి సంతృప్తి చెందిన పరమ శుంఠ గారు తమ ప్రసంగాన్ని ప్రారంభించారు.
"సభలో వున్న శుంఠలన్దరికీ నమస్కారం. స్వతంత్ర భారతదేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న మార్పులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. పరిస్థితులు ఈ విధంగానే కొనసాగితే, గత 68 సంవత్సరాలుగా పరిరక్షించుకుంటూ వస్తున్న మన స్వాతంత్ర్యం ఇంకెంతో కాలం మనలేదన్న నిష్ఠుర సత్యాన్ని శుంఠలన్దరూ దర్శించవలసినదిగా కోరుకుంటున్నాను."
సభ మొత్తం గంభీరమైన వాతావరణం నెలకొంది. జెండా వందనం తరువాత పంచిన చాక్లెట్లను కూడా తినడం మరచిపోయి సభలో లీనమైపోయిన శుంఠలను చూసి పులకితుడైన శ్రీ పరమ శుంఠ గారు తమ ప్రసంగాన్ని కొనసాగించారు.
" ఒక్కసారి 68 ఏళ్ళ మన స్వతంత్ర భారత చరిత్రను అవలోకిస్తే, మన స్వాతంత్ర్య పరిరక్షణలో మన నాయకులు చూపిన అవగాహనా మరియు దూరదృష్టి న భూతో... అనవచ్చు. మనం ఏయే కారణాలవల్లైతే పరాయి పాలనకు గురయ్యామో గుర్తించి మళ్ళీ భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు సంభవించకుండా మన గత నాయకులు తగు జాగ్రత్తలు తీసుకున్నారనటంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు.
ఉదాహరణకి మనలో మనం కొట్టుకు చావడం వల్లనే విదేశీయులు మనల్ని జయించగలిగారన్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకే భవిష్యత్తులో అటువంటి గొడవలకు తావు లేకుండా "గాంధీ" అన్న రాజ వంశాన్ని సృష్టించి, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగి ఎవరు తన్నుకు చచ్చినా దేశాధికారం గాంధీల చేతుల్లో మత్రమే ఉండే విధంగా ఏర్పాటు చేయటం ద్వారా దేశ సమైక్యతనూ తద్వారా దేశ సమగ్రతనూ కాపాడారు.
అలాగే విదేశీ వ్యాపారం ద్వారా మరలా వలసవాదులు రాకుండా, అవినీతీ , ఆశ్రిత పక్షపాతాలను పెంచి పోషిస్తూ, విదేశాలేం ఖర్మ, మన దేశీయులే మన దేశంలో వ్యాపారం చేయాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి సృష్టించారు.
పెట్టుబడిదారులు మన దేశ సంపదకు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు, ఉచిత పథకాలు, కులాధారిత రిజర్వేషన్లూ, సమ్మెలూ, బందులూ ప్రవేశపెట్టి ప్రజలను సోమరులను చేయడం ద్వారా దేశ సంపద పెరగకుండా తద్వారా విదేశీయుల కన్ను మన దేశంపై పడకుండా కాపాడుకున్నారు. ఏమిచ్చి మనం మన నాయకుల ఋణం తీర్చుకోగలం చెప్పండి?"
ఈ మాట చెబుతూ పరమ శుంఠ గారు కళ్ళు తుడుచుకున్నారు. సభలోని శుంఠలు శ్వాసించటం కూడా మరచిపోయి పరమ శుంఠగారి ఉపన్యాసం వింటున్నారు. పరమ శుంఠగారు మళ్ళీ కొనసాగించారు.
" అంతేనా! మనకి నాగరికత నేర్పడానికని కదూ తెల్లవాళ్ళు మనకు స్వాతంత్ర్యం ఇవ్వకుండా తాత్సారం చేసింది. అందుకే ఎప్పుడు పుట్టిందో తెలీని మన సంస్కృతిని భ్రష్ట్టుపట్టించి, తినే తిండి నుంచి కట్టుకునే బట్టవరకూ, మాట్లాడే భాష నుండి పండుగలూ పబ్బాలూ వరకూ పాశ్చాత్య సంస్కృతినే అనుసరిస్తూ మనకు సంస్కృతి లేదన్నవారి నోళ్ళు మూయించారు.
పెద్ద భూభాగాలను రక్షించుకోవడం కష్టమని తలచి దేశాన్ని మూడు ముక్కలు చేయడమే కాకుండా, భవిష్యత్తులో కాశ్మీర్, అస్సాం , బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి సరిహద్దు రాష్ట్రాలను కూడా వేరుచేసి చక్కగా చిన్నగా మొండెంలా మిగిలిన చిన్న భాగాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవచ్చని మన నాయకుల దురాలోచన("దూరాలోచన" అని చదువుకోగలరు) కదూ!
అయితే ఇప్పుడేమి జరుగుతున్నది?
దేశ నిర్మాణ సంబంధిత విషయాలలో రాష్ట్రాలకు అధిక ప్రాముఖ్యతట(నిటి ఆయోగ్),వివిధ దేశాలతో కనీవినీ ఎరుగని రీతిలో వాణిజ్య ఒప్పందాలట.
ప్రభుత్వ సంస్థలలో ప్రయివేటు సంస్థల భాగస్వామ్యమట, "మేక్ ఇన్ ఇండియా" అట;
ప్రభుత్వ సంస్థలలో ప్రయివేటు సంస్థల భాగస్వామ్యమట, "మేక్ ఇన్ ఇండియా" అట;
వేర్పటువాదులతో శాంతి ఒప్పందాలాట, "యోగా డే" అట.
అసలు ఘనత వహించిన గాంధీ వంశము వారి చేతిలో అధికారము లేకపోవటం వల్ల వచ్చిన తంటా కదా ఇది.
కాబట్టి, నా ప్రియమైన శుంఠలారా! ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గత ఆరు దశాబ్దాలుగా మన దేశ సార్వభౌమత్వాన్ని సమర్ధవంతంగా నిలబెట్టిన మన నాయకుల విధానాలను పునరుద్ధరించి తద్వారా మన దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టడంలో మన శుంఠ సంఘం పోషించవలసిన కీలక భూమిక ఏమిటంటే..... "
పరమ శుంఠ గారు వాక్యము పూర్తి చేసేంతలో మధ్యాహ్న భోజనం సిద్ధం అయ్యిందన్న వార్తా దావానలంలా సభలో వ్యాపించటంతో సభలోని శుంఠలందరూ ఒకరినొకరు తొక్కుకుంటూ భోజనశాల వైపు బిలబిలమంటూ పరుగు తీసారు.
వేదికపై పరమ శుంఠగారు మాత్రం దిక్కులు చూస్తూ మిగిలిపోయారు.
(భావి భారత నిర్మాణంలో శుంఠ సంఘం ఎటువంటి భూమిక పోషించనుందో మున్ముందు చూద్దాం.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి