9, మార్చి 2018, శుక్రవారం

యద్భావం తద్భవతి

కొన్నేళ్ళ క్రిందట 'ఓయ్' అని ఒక సినిమా చూసాను. ఆ సినిమాలో కథానాయకుడు రేపుంటుందో లేదో తెలియదు కనుక ఈరోజే సాధ్యమైనంత ఆనందాన్ని నింపుకోవాలనుకునే రకం. కథానాయకి మాత్రం ఏం చేసినా సరే అన్నీ దీర్ఘకాలిక ప్రణాళికతో చేస్తూ క్రమబద్ధమైన జీవితం గడిపే బాపతు. ఇద్దరికీ కలుగుతుంది పరిచయం, ఆపై ప్రేమ. ఆఖరుకి, జీవితం చాలా పెద్దది అనుకున్న కథానాయకి, అల్పాయుర్ధాయంతో అర్ధాంతరంగా చనిపోతుంది. జీవితం చాలా చిన్నదనుకునే కథానాయకుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోతాడు; ప్రేయసి తనకి మిగిల్చిన ఒంటరి ఇంకా సుదీర్ఘమైన శేష జీవితంతో.

మేము చదువుకునే రోజుల్లో ఒక తెలుగు పాఠం ఉండేది. రచయుత పేరు గురుతులేదు. అందులో ఈ విధంగా మనం అనుకున్నదానికి వ్యతిరేకంగా జరిగేది నిత్యజీవన దృగ్విషయమని బోలెడు ఉదాహరణలు ఇస్తాడు రచయిత. ఉదాహరణకి, ఇప్పుడు, ఒక రోజు ఏదో కారణంచేత ఆఫీసుకి వెళ్లటం ఆలస్యం అయ్యిందనుకోండి, దారిలో మనం మనసులో ఏ ఉపద్రవం జరుగకూడదని దేవుడికి మొరపెట్టుకుంటామా! సరిగ్గా అదే రోజు మన పై అధికారులు ఆకస్మిక తనిఖీ అంటూ ఊడిపడతారన్నమాట.

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినదని పెద్దలంటుంటారు కదా. ఇదేనన్నమాట. కాని ఇదే పెద్దలు 'యద్భావం తద్భవతి' అని కూడా అంటుంటారు కదా. అంటే నువ్వేమనుకుంటే అదే అవుతుందని. దీన్నే 'ది సీక్రెట్' అన్న పుస్తకంలో రోండా బ్రైన్ గారూ, 'ది ఆల్కెమిస్ట్' అన్న పుస్తకంలో పాలో కొయల్హో గారూ తమదైన శైలిలో చెప్పారు. ఈ యద్భావం తద్భవతి గురించి ఒక ఆసక్తికరమైన ప్రాకృతిక ఉపమానాన్ని పెద్దలు చెబుతుంటారు. అదేమిటంటే, కందిరీగలు సంతానోత్పత్తిలో భాగంగా ఒక రకమైన కీటకం యొక్క లార్వాలను దొంగిలించి, వాటి చుట్టూ గూడు కట్టి పెద్దగా రొద చేసుకుంటూ ఆ లార్వా చుట్టూ పరిభ్రమిస్తాయంట. అప్పుడు ఆ లార్వాలు పిల్ల కందిరీగల్లా మారిపోతాయట. బాగుంది కదూ.

ఇక్కడ కందిరీగకు యద్భావం తద్భవతి ఐతే, కీటక లార్వాకి మాత్రం అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి జరిగింది. అనుకున్నది జరిగే అవకాశం ఉంటే మొదటిది, లేకుంటే రెండోది అన్నమాట. దీన్నే ఏ ఎండకాగొడుగును పట్టడం అని పెద్దలంటుంటారు. నేర్పు, విజ్ఞత, లౌక్యం అని కూడా అంటుంటారు.

ఈ అనుకున్నదొకటీ అయినదొకటీలు కాకుండా జీవితంలో 'యద్భావం తద్భవతీ'లు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా. కానీ నిజం ఏమవ్వచ్చు తాతా అని మా తాతగారిని అడిగితే, మనవడా నువ్వనుకున్నది ధర్మబద్ధమైనదైతే 'యద్భావం తద్భవతి' లేకపోతే 'అనుకున్నదొకటి అయినది ఒక్కటి' అని చెప్పేవారేమో....!

ఇంతకీ నేనేమనుకుంటున్నాను? ఏమొ?

అందరికీ యద్భావం తద్భవతి.

13, ఫిబ్రవరి 2018, మంగళవారం

సయోధ్య!

సయోధ్య!

ఎర్రబాబు: సయోధ్యలో ఒక ఆసుపత్రి కడితే సరిపోతుంది. ఏ సమస్యా ఉండదు.

భక్తుడు: అన్నా! సయోధ్యలో స్వామి మందిరం కట్టడం తథ్యం. ఇక పోతే ఆసుపత్రి అన్నావు కదా. కాస్త విశాలంగా ఎందుకు ఆలోచించకూడదు నువ్వు? సయోధ్యలో కట్టే మందిరం దక్షిణంలో ఉన్న పరపతి ఆలయం స్థాయిలో ఉంటుంది. ఒక్క ఆసుపత్రే కాదు, దానికి అదనంగా ఒక విద్యాలయం, ఒక అన్నసత్రం, ఒక ఆవాస మందిరం ఇంకా చాలా వస్తాయి...మొత్తం మీద సయోధ్యకు ఒక రకమైన వైభవం వచ్చేస్తుంది. అది కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే ధనంతో. ప్రభుత్వనికి పెద్దగా ఖర్చు కూడా అవదు. అప్పుడు నిజంగానే ఏ సమస్యా ఉండదు కదా

ఎర్రబాబు: ఇక్కడ సమస్య అంటే ప్రజా సౌకర్యాల గురించి కాదు. కాబ్రి మసీదును కూల్చి అక్కడ మందిరం కడితే మత విద్వేషాలు పెరగవా? ఇప్పటికే కాబ్రి పేరుతో సింధువులపై ఎన్ని దాడులు జరుగుతున్నాయో చూసావా? ఇవన్నీ మనకు అవసరమంటావా?

భక్తుడు: చూడు ఎర్రబాబు... దేశ జనాభాలో మధ్యవాసియా మతస్తులు రమారమి 15% ఉన్నారనుకుంటే, వాళ్ళలో అత్యధికులకు సయోధ్యలోగల స్వామి మందిరంతో ఎటువంటి సమస్యా లేదు. మిగిలిన అల్ప సంఖ్యాక మధ్యవాసియా మతానుయూయులకు కాబ్రి కాకపోతే ఒక చశ్మీర్, ఒక పెరుగుస్తీనా, ఒక కర్కీ, ఒక అరెమికా, ఒక బోరింగ్యా ఇలా ఈ భూమ్మీద వాళ్ళ ఛాందసవాదానికి ప్రతిఘటన ఎదురయ్యే ప్రతీ సారీ మనదేశంలో కూడా కంగాళీ జరుగుతుంది. కాబ్రీలో ఒక మసీదు లేదా ఆసుపత్రి కట్టడం వల్ల అది ఆగదు. సింధువులపై దాడులు జరుగుతున్నాయని అస్తిత్వాన్ని కోల్పోమంటావా? ప్రతీకార దాడులు జరిగితే ఇదే సలహా మధ్యవాసియా మతస్తులకు ఇవ్వగలవా?

ఎర్రబాబు: ఇది ఒక్క స్వామి మందిరంతో ఆగుతుందా? తటస్థంగా ఉండే మధ్యవాసీయ మతావలంబకులు కూడా ఈ చర్య వలన ఛాందసవాదుల పక్షాన చేరే అవకాశం ఉంది. మన సింధువులలోనే చాలా మందికి అక్కడ మందిరం కట్టడం ఇష్టం లేదు. అక్కడ మందిరం కట్టడం వల్ల అశాంతి తప్ప మరింకేం సాధించలేము.

భక్తుడు: అయ్యా నిజమే. ఇది ఒక్క స్వామి మందిరంతో ఆగదు. అన్నీ కాకపోయినా కొన్నింటిని మాత్రం తిరిగి పునరుద్ధరించవలసియున్నది. ఇక కొత్తగా మనం పొందే అశాంతి ఏముంది? అది ఎప్పటినుంచో తిష్ఠ వేసింది మన దేశంలో. ఒక్కసారి ఎవరి పరిధి ఎంతవరకు అన్న స్పష్టత వస్తే శాంతి దానంతట అదే వస్తుంది. అసలు మన దేశంలో ఉన్న విదేశీ మతస్తులంతా ఒకప్పటి సింధువులే కదా. బలవంతానో, ప్రలోభం చేతనో లేక మరే ఇతర కారణం వల్లనో వారు మతం మారవలసి వచ్చింది. ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తే సరిపోతుంది. తమ మూలాలు సింధు దేశంలోనే ఉన్నాయిగానీ మరెక్కడో మధ్యవాసియాలో కాదు అన్న సత్యం ఎరుక పడితే సమస్య ఉండదు. లేదూ మా మూలం మధ్య ఆసియా అంటారా, మరిక్కడెందుకు వారి పెత్తనం.

ఎర్రబాబు: అంటే ఈ దేశం కేవలం సింధువులదేనా?

భక్తుడు: ఈ దేశం రాజ్యాంగం ప్రకారం ఎవరు అర్హులో వారందరిది.

ఎర్రబాబు: సరే. అయ్యిందేదో అయ్యింది. అందరూ సుఖంగా ఉండొచ్చుగా. గతాన్ని తవ్వుకొని ఈ గొడవలన్నీ ఎందుకూ?

భక్తుడు: నాయనా ఎర్రబాబూ, నీది అమాయకత్వమా లేదా ముసుగా అన్న విషయం తెలియటంలేదు. నీది ముసుగు అన్న విషయం కూడా ఎరుకపడని అమాయకత్వం కావచ్చు. సయోధ్యలో స్వామి మందిరం తథ్యం. ఆ నిజంతో బ్రతకడం అలవాటు చేసుకో.సెలవు.

(Most of the names are taken from the blog www.tetageeti.wordpress.com)

21, జనవరి 2018, ఆదివారం

ఆవు-పులి

ఆవు-పులి
మహాత్మ: ఆవు ఎంతో గొప్పది కదా. ప్రాణంపై తీపి లేకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.

సర్దార్: అసలు నోటికందిన ఆహారాన్ని తినటం మాని ఆవుకు అవకాశం ఇచ్చిన పులి గొప్పతనం ఏమీ లేదంటారా?

మహాత్మ: ఆవు దొరకకపోతే పులి ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కానీ ఆవు విషయం అలా కాదు. మాట తప్పి ప్రాణం కాపాడుకోవచ్చు. కానీ ఆవు తన మాటకే కట్టుబడి ఉంది కదా.

సర్దార్: బలహీనురాలు. తనపై ఆధారపడిన పసి ప్రాణం ఒకటి ఉంది. అలాంటప్పుడు ఆవు ఎంత జగ్రత్తగా ఉండాలి! తన మందను వీడి పోవచ్చునా? నాకైతే ఆవులో బాధ్యతా రాహిత్యం కనిపిస్తుంది.

మహాత్మ: ఎల్లవేళలా కాలం మనకు అనుకూలంగా ఉండదు కదా. కానీ మృత్యువు ఎదురుగా ఉన్నప్పుడు కూడా బిక్క చచ్చిపోకుండా చివరి నిమిషంలో తను నెరవేర్చాల్సిన బాధ్యతలను గుర్తించింది కదా. తన బిడ్డను కడసారి చూసి మంచిమాటలు చెప్పి వస్తానని పులిని అభ్యర్థించింది కదా. అటువంటి ఆవుకి బాధ్యతా రాహిత్యం ఆపాదించటం సరికాదేమో.

సర్దార్: అసలు కథ నడవటానికి పులి తన సహజాతానికి విరుద్ధంగా ప్రవర్తిచటమే కారణం. ఆవుకి చివరి కోరికను మన్నించటంలోనూ, మాట నిలబెట్టుకున్న ఆవుని తినకుండా వదిలేయటంలోనూ నిర్ణయాధికారం పులిదే. బలహీనమైన ఆవు మంచితనం కంటే బలమైన పులి చూపించిన మంచితనం ఎంతో గొప్పది అని నా ఉద్దేశ్యం.

మహాత్మ: హ్మ్...ఏమో. ఇక్కడ ఆవుని వదిలేసిన పులి మరొక సందర్భంలో మరొక ఆవుకు లేదా మరేదైనా మృగానికి అటువంటి అవకాశం ఇస్తుందంటారా? పులి మంచితనానికి పూచీ లేదు. ఆవు విషయంలో అలా కాదు.

సర్దార్: పులి ఆవు చూపించిన నిజాయితీకి ప్రభావితమయ్యింది. అటువంటి నిజాయితీ గల ఆవు బ్రతకాలని కోరుకుంది. ఇటువంటి సందర్భాలు ఒకటో అరో ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ఆ సందర్భంలో పులి ప్రవర్తన ఆదర్శవంతం. ఇక తన జీవనం కోసం మృగాలను చంపి తినటం తప్ప వేరే అవకాశం లేదు కాబట్టి దాన్ని తప్పు పట్టలేం. దాని ధర్మం అదే.

మహాత్మ: సరే. ఇది ఎంతకీ తెమలేది కాదు. అడవిలో ఆవులుంటాయి, పులులుంటాయి ఇంకా గోముఖ వ్యాఘ్రాలు కూడా ఉంటాయి. మొదటి రెండింటివల్ల అడవితల్లికి ఎటువంటి కీడూ జరుగదు. భోజనం వేళ అయ్యింది. మళ్ళీ కలుద్దాం సర్దార్. శెలవు.

సరార్: శెలవు మహాత్మా!

23, డిసెంబర్ 2017, శనివారం

అండం

ఇది ఒక మిత్రుడు ఎప్పుడో ఒక తెలుగు లఘుచిత్రం కోసం పంపిన ఆంగ్ల సంభాషణకు తెలుగు అనువాదం .....


నువ్వు చనిపోయిన సమయంలో మీ ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నావు.
అదొక కారు ప్రమాదం.  పెద్దగా చెప్పుకోవలసిన సంగతేం కాదు గానీ ప్రాణాంతకమైన ప్రమాదం, అంతే.
నువ్వు నీ ఇద్దరు పిల్లలను, భార్యను వదిలేసి వచ్చావు. అనాయాస మరణమే నీది. వైద్యులు వాళ్ళ ప్రయత్నం చేశారు గానీ లాభం లేకపోయింది. నీ శరీరం ఎంతగా ఛిద్రమైపోయిందంటే, ఇక బ్రతికినా కూడా ఏ మాత్రం ఉపయోగం లేదంటే నమ్ము!

అదిగో! అప్పుడే, నువ్వు నన్ను కలిసింది.
"ఎ... ఏమయ్యింది?, ఎక్కడున్నాను నేను?" అడిగావు నువ్వు.
"నువ్వు చనిపోయావు." అని నీళ్ళు నమలకుండా ఉన్న విషయం చెప్పాను నేను.
" అక్కడ ఓ...  ఒక ట్రక్కు గతితప్పింది...."
"అవును. " చెప్పాను నేను.
"నే... నేను చనిపోయానా?"
"హ్మ్మ్...కానీ అంతగా బాధపడకు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే." నా సమాధానం.
నువ్వు చుట్టూ చూశావు. అంతా శూన్యం. అక్కడ కేవలం నువ్వూ నేను మత్రమే. " ఈ ప్రదేశం ఏమిటి?" నువ్వు అడిగావు.  "మరణానంతర జీవితమంటే ఇదేనా?"
"ఒకవిధంగా అంతే." చెప్పాను నేను.
"నువ్వు దేవుడివా?"
"అవును."
"నా భార్యా పిల్లలూ....!", "వాళ్ళ సంగతేంటి?" , "వాళ్ళకేం అవలేదుగా?" గబగబా అడిగావు నువ్వు.
అప్పుడు నేనన్నాను, "నాకు కూడా అదే చూడాలనుంది.", " చూడు, నువ్వు చనిపోయిన వెంటనే నీ మొదటి ఆందోళన నీ కుటుంబం గురించే. మంచి విషయమే సుమీ."
వెంటనే నువ్వు నా వైపు ఆశ్చర్యంతో చూశావు. నీకు నేను దేవుడిలా కనిపించలేదు. బహుశా ఎవరో పురుషుడో లేకపోతే స్త్రీ అనో అనుకుని ఉంటావు. లేదంటే ఎవరో ఒక పెద్దమనిషిలా అనుకుంటా. దేవుడిలా మాత్రం భావించలేదు. బహుశ పాఠశాలలో వ్యాకరణం ఉపాధ్యాయుడిగా భావించావేమో?
"బాధపడకు," చెప్పాను నేను. " నీ కుటుంబం బాగానే ఉంటుంది.నీ పిల్లలు నిన్ను ఒక ఉత్తమమైన నాన్నగానే గుర్తుంచుకుంటారు. వాళ్ళకి నీ పట్ల తృణీకారం పెంచుకోనేంత సమయం లేదు మరి. నీ భార్య బైటకు ఏడ్చినా లోన స్వాంతన పొందుతుంది. నిజం చెప్పాలంటే, నీ వైవాహిక జీవితం పూర్తిగా బీటలువారింది. తను మనసులో స్వాంతన పొందినందుకు నీ భార్య తనని తాను నిందించుకుంటే అది గొప్పే.
"ఓహ్... అయితే ఇప్పుడేమవుతుంది? స్వర్గం, నరకం లేక ఇంకేమైనా?" అడిగావు నువ్వు.
"అవేమి కాదు. నువ్వు మళ్లీ పునర్జన్మ పొందుతావు." చెప్పాను  నేను.
"ఏంటీ.... అంటే హిందువులు చెప్పినది నిజమేనన్నమాట."
"ప్రతి మతమూ సరియైనదే. పద అలా నడుద్దాం"
అలా శూన్యంలో నడుస్తుంటే నన్ననుసరించావు.
"మనం ఎక్కడికి వెళ్తున్నాము?"
"ఇదిమిద్దంగా ఫలానా చోటుకి అని కాదు, నడుస్తూ మాట్లాడుతుంటే బాగుంటుంది, అందుకు" చెప్పాను నేను.
"సరే అయితే దీని సంగతేంటి?" అడిగావు నువ్వు. "నేను మళ్ళీ పుట్టినప్పుడు ఒక రాయని పలకలా ఉంటాను కదా? ఒక చిన్న శిశువుగా... ముందు జీవితంలో నా అనుభవాలూ, నేను చేసిన పనులూ, వీటితో మరిక సంబంధం ఉండదు కదా?"
"అలా కాదు. నీ గత జన్మల తాలూకా అనుభవాలన్నీ నీ స్మృతిలో ఉంటాయి. కాకపోతే అవి నువ్వు గుర్తుకు తెచ్చుకోలేవంతే." అన్నాను నేను.
నా నడకను ఆపి నీ భుజాలను పట్టుకుని చెప్పాను "నీలో ఉన్న ఆత్మ నువ్వు ఊహించినదానికన్నా ఎంతో బృహత్తరమైనది, అందమైనది మరియు అనంతమైనది. దీనిని  అత్యంత స్వల్ప పరిమాణంలో మత్రమే సాధారణ మనవ మేధస్సు గ్రహించగలుగుతుంది. ఒక పాత్రలోని నీటి వెచ్చదనాన్ని తెలుసుకోవడానికి దాంట్లో నీ వేలిని ముంచుతావు కదా. అలాగే ఆత్మవైన నువ్వు ఈ ప్రపంచంలో ఒక చిన్న రూపంలో ప్రవేశించడం ద్వారా ఈ ప్రపంచం యొక్క అన్ని అనుభవాలను పొందుతావన్నమాట."
"నువ్వు గత 48 సంవత్సారాలుగా మానవ రూపంలోనే ఉండటంచేత నువ్వింకా అనంతమైన నీ ఆత్మ స్వరూపాన్ని ఇంకా గ్రహించలేకపోతున్నావు. కాని ఇక్కడ తగినంత సమయం గడిపితే నీకు క్రమంగా అంతా  అవగతమౌతుంది. కాకపోతే ప్రతి జన్మాంతరంలోనూ ఈ వృధా ప్రయాస అర్థరహితం."
"అయితే ఇప్పటివరకు నేనెన్నిసార్లు పుట్టాను?"
"అబ్బో చాలా సార్లు పుట్టావు. రకరకాల జన్మలెత్తావు. అయితే ఈ సారి నువ్వు కీ.పూ. 540 లో చైనా దేశంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పాపగా జన్మిస్తావు."

"ఆ... ఏంటి?", "నన్ను మళ్లీ కాలంలో వెనక్కి పంపుతారా?" తత్తరపడుతూ అడిగావు.
"అవును. మీ లోకంలో మీరు అనుభూతి చెందే సమయం మీకు మాత్రమే పరిమితం. మా లోకంలో సమయం ఈ విధంగా ఉండదు."
"నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?" నీ ప్రశ్న.
"నేను ఒకదగ్గరినుంచి వచ్చాను. అక్కడ నాలాగే చాలామంది ఉంటారు. ఆ ప్రదేశం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉందని తెలుసు కాని నిజంగా అది నీకు చెప్పినా ఇప్పుడు అర్థంకాదు. " వివరించాను నేను.
"ఓహొ..." కాస్త నిరాశగా నిట్టూర్చావు. "కాని నేను కాలంలో వెనక్కి వెళ్లి కుడా జన్మించగలిగితే ఎక్కడో ఒకచోట నన్ను నేను కలుసుకొనే అవకాసం ఉంది కదా?"
"తప్పకుండా. ఇది నిరంతరమూ జరుగుతూనే ఉంటుంది కుడా. కాకపోతే మీ రెండు జన్మల్లో వాటి లౌకిక జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉండటంచేత మీరు ఈ విషయాన్ని గ్రహించలేరు. "

"అయితే దీని ఉద్దేశం ఏమిటి?"
"నిజంగా?" నేను అడిగాను. "నిజంగానే నువ్వు నన్ను జీవిత పరమార్థం గురించి అడుగుతున్నావా?". "బాగా అరిగిపోయిన ప్రశ్నేమో?"
"ఈ ప్రశ్న  హేతుబద్ధమైనదే." రెట్టించావు నువ్వు.
అప్పుడు నీ కళ్ళలోకి చూస్తూ చెప్పాను, "జీవిత పరమార్థం, నేను ఈ విశ్వాన్ని సృష్టించడానికి కారణం, నువ్వు పరిపక్వత చెందాలనే."
"అంటే మనుషులనా నీ అర్థం? మనుషులు పరిపక్వత చెందాలనా?"
"కాదు. నువ్వు మాత్రమే. ఈ మొత్తం విశ్వాన్ని నీకోసమే సృష్టించాను. ప్రతి కొత్త జన్మలో నీ యొక్క అనుభవ పరిధి, పరిపక్వత, జ్ఞానమూ పెరుగుతూ వస్తాయి."
"కేవలం నెనొక్కడినేనా? మిగిలినవారి సంగతేంటి?"
"వేరే ఇంకెవరూ లేరు."  "ఈ విశ్వంలో నువ్వూ నేనూ మాత్రమే ఉన్నాం. "

నువ్వు నా వైపు అయోమయంగా చూసావు. "మరైతే భూమిపై ఉన్న మనుషులంతా...."
"అన్నీ నువ్వే. నీ యొక్క వివిధ పునర్జన్మలు. "
"ఆగాగు. అంటే నేను అందరినీనా!?"
"ఆ... ఇప్పుడు దారికొచ్చావ్" మెచ్చుకోలుగా నీ వీపు తడుతూ చెప్పాను.
"ఈ భూమిపై జీవించిన ప్రతీ మనిషినీ నేనేనా?"
"అలాగే ఇకముందు జీవించబోయేవారు కుడా కదా."
"అబ్రహం లింకన్ నేనేనా?"
"జాన్ విల్కీస్ బూత్ కుడా నువ్వే." బదులిచ్చాను నేను.
"నేను హిట్లర్ కూడానా?" కాస్త విస్మయంతో అడిగావు.
"నువ్వు హిట్లర్ చంపిన లక్షల మంది కుడా" చెప్పాను నేను.
"నేను జీసస్ని?"
"నువ్వు అతడ్ని అనుసరించిన ప్రతిఒక్కడివీ."
నువ్వు మూగబోయావు.
అప్పుడు నేను ఇలా కొనసాగించాను, "నువ్వు ఒకరికి హాని తలపెట్టిన ప్రతిసారి నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. నువ్వు ఇతరులపై చూపించే ప్రేమంతా నీపై నువ్వే చూపించుకుంటున్నావు. ఈ విశ్వంలో ప్రతిఒక్కరూ అనుభవించే సుఖదుఃఖాలను నువ్వే అనుభవిస్తున్నావు."
చాలా సేపు అలోచించి," ఎందుకు?'' అని అడిగావు. " ఎందుకు ఇదంతా చేయడం? "
"ఎందుకంటే, ఒకానొక రోజు నువ్వు నాలా పరిణామం చెందుతావు. ఎందుకంటే నీ అంతిమ గమ్యం అదే. నువ్వూ నాలాంటి వాడివే. నువ్వు నా బిడ్డవి."
"ఓహ్...అంటే నేను కుడా దేవుడ్నేనా?"
"కాదు. అప్పుడే కాదు. నువ్వింకా పిండానివే. నువ్వింకా ఎదుగుతున్నావు. ఒకసారి నువ్వు అన్ని మానవ జన్మలనూ అనుభవించిన తరువాత నీకు పుట్టేందుకు తగిన పరిపక్వత వస్తుంది. "
"అంటే ఈ ప్రపంచమంతా...కేవలం... " అని ఆగావు నువ్వు.
"ఒక అండం" పూర్తీ చేశాను నేను. "ఇప్పుడు నీ తరువాతి జీవితంలోకి వెళ్ళే సమయం అయ్యింది."
ఈ విధంగా చెప్పి నిన్ను నీ మార్గంలో పంపించాను.



















22, డిసెంబర్ 2017, శుక్రవారం

జరిత , మాతృ వేదన

మేము పదవ తరగతి చదివేటప్పుడు "మాతృ వేదన'' అని ఒక పద్యభాగ పాఠ్యాంశం ఉండేది. ఇది మహా భారతం ఖాండవ వన దహన ఘట్టంలోనిది. ఇంతకీ ఈ కథ ఏమిటంటే....

మందపాలుడు అనే ముని మానవ జన్మలో సంతానం లేని కారణంగా త్వరితగతిన సంతానం కోసం లావుక పక్షి జన్మ ఎత్తుతాడు. జరిత అనే ఆడ లావుక పక్షితో కూడి, ఖాండవవనంలో నివసిస్తూంటాడు. వారికి రెక్కలు ఇంకా రాని నలుగురు పిల్లలు. జరితారి వారిలో పెద్దవాడు. ఐతే ఒకనాడు మందపాలుడు లేనప్పుడు అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహిస్తున్న సమయంలో ఆ అగ్నికీలల్లో చిక్కుపడిన తనపిల్లల్ని రక్షించుకొనేందుకు జరిత పడే మానసిక సంఘర్షణే ''మాతృ వేదన''. రెక్కలు రాని పిల్లలు ఎగురలేరు.  తనేమో వాళ్ళని విడిచి వెళ్ళలేదు. ఈ విధంగా ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న సందర్భంలో, పెద్ద కొడుకు ఐన జరితారి, బ్రతికి ఉంటే అమ్మ మళ్ళీ పిల్లల్ని పెట్టవచ్చనీ, వాళ్ళని అగ్నినుండి రక్షిండం దాదాపు అసాధ్యం కనుక తన తల్లినైనా ఎగిరిపోయి ప్రాణాలు కాపాడుకోమనీ వేడుకుంటాడు. అప్పుడు కొడుకు చెప్పినట్టుగానే జరిత అయిష్టంగానే అయినా ఎగిరిపోయి తన ప్రాణాలు కాపాడుకుంటుంది. కానీ విచిత్రంగా ఖాండవవనంలో సమస్త జీవజాలాన్నీ భక్షించిన అగ్నిదేవుడు ఈ నలుగురు పక్షి పిల్లలకి ఏ హానీ తలపెట్టకుండా ముందుకు పోతాడు. ఎందుకంటే ముందుగానే మందపాలుడు తన పిల్లలకు హాని తలపెట్టవద్దని అగ్నిదేవుడిని వేడుకుంటాడు. దానిని అగ్నిదేవుడు మన్నిస్తాడు. ఇది క్లుప్తంగా కథ. 

ఇక్కడ మందపాలుడు ఆ విషయాన్ని జరితకు ముందుగానే చెప్పి ఉంటే పాపం తనకు కొద్ది గంటల నరకయాతన తప్పేది కదా! ఎందుకంటే సమస్య మొదలైనప్పుడే దాని పరిష్కారం కూడా మొదలైపోయింది. ఈ విషయం తెలియని జరిత ఎంత కష్టం అనుభవించింది! ఆ ఒత్తిడిలో ఏ అఘాయిత్యానికీ పూనుకోకుండా కొడుకు మాటలు వినటం వల్ల కథ సుఖాంతమైంది. ఐతే అలాంటి కథలు మన జీవితంలో ఎన్నో...ప్రతి సమస్యకూ పరిష్కారం సమీప భవిష్యత్తులో ఉండే ఉంటుంది. అప్పటివరకూ మనం చేయగలిగిన ఉత్తమమైన పని చేస్తూ ఫలితం గురించి ఎదురుచూడటం మంచిది కదా? ఐతే అలా ఎదురుచూడగలిగిన ఓపిక కొంతమందికి ఉండదు. అందుకే ఈ ఆత్మహత్యలూ, హత్యలూ.... అలాగే ప్రయత్నిస్తూ ఎదురు చూసినంత మాత్రాన ఎప్పుడూ మనకు అనుకూల ఫలితాలు వస్తాయని కాదు. కానీ ఒక ప్రతికూలతను తట్టుకున్న అనుభవం వస్తుంది కదా! అటువంటివారిని చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది కదా!