మేము పదవ తరగతి చదివేటప్పుడు "మాతృ వేదన'' అని ఒక పద్యభాగ పాఠ్యాంశం ఉండేది. ఇది మహా భారతం ఖాండవ వన దహన ఘట్టంలోనిది. ఇంతకీ ఈ కథ ఏమిటంటే....
మందపాలుడు అనే ముని మానవ జన్మలో సంతానం లేని కారణంగా త్వరితగతిన సంతానం కోసం లావుక పక్షి జన్మ ఎత్తుతాడు. జరిత అనే ఆడ లావుక పక్షితో కూడి, ఖాండవవనంలో నివసిస్తూంటాడు. వారికి రెక్కలు ఇంకా రాని నలుగురు పిల్లలు. జరితారి వారిలో పెద్దవాడు. ఐతే ఒకనాడు మందపాలుడు లేనప్పుడు అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహిస్తున్న సమయంలో ఆ అగ్నికీలల్లో చిక్కుపడిన తనపిల్లల్ని రక్షించుకొనేందుకు జరిత పడే మానసిక సంఘర్షణే ''మాతృ వేదన''. రెక్కలు రాని పిల్లలు ఎగురలేరు. తనేమో వాళ్ళని విడిచి వెళ్ళలేదు. ఈ విధంగా ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న సందర్భంలో, పెద్ద కొడుకు ఐన జరితారి, బ్రతికి ఉంటే అమ్మ మళ్ళీ పిల్లల్ని పెట్టవచ్చనీ, వాళ్ళని అగ్నినుండి రక్షిండం దాదాపు అసాధ్యం కనుక తన తల్లినైనా ఎగిరిపోయి ప్రాణాలు కాపాడుకోమనీ వేడుకుంటాడు. అప్పుడు కొడుకు చెప్పినట్టుగానే జరిత అయిష్టంగానే అయినా ఎగిరిపోయి తన ప్రాణాలు కాపాడుకుంటుంది. కానీ విచిత్రంగా ఖాండవవనంలో సమస్త జీవజాలాన్నీ భక్షించిన అగ్నిదేవుడు ఈ నలుగురు పక్షి పిల్లలకి ఏ హానీ తలపెట్టకుండా ముందుకు పోతాడు. ఎందుకంటే ముందుగానే మందపాలుడు తన పిల్లలకు హాని తలపెట్టవద్దని అగ్నిదేవుడిని వేడుకుంటాడు. దానిని అగ్నిదేవుడు మన్నిస్తాడు. ఇది క్లుప్తంగా కథ.
ఇక్కడ మందపాలుడు ఆ విషయాన్ని జరితకు ముందుగానే చెప్పి ఉంటే పాపం తనకు కొద్ది గంటల నరకయాతన తప్పేది కదా! ఎందుకంటే సమస్య మొదలైనప్పుడే దాని పరిష్కారం కూడా మొదలైపోయింది. ఈ విషయం తెలియని జరిత ఎంత కష్టం అనుభవించింది! ఆ ఒత్తిడిలో ఏ అఘాయిత్యానికీ పూనుకోకుండా కొడుకు మాటలు వినటం వల్ల కథ సుఖాంతమైంది. ఐతే అలాంటి కథలు మన జీవితంలో ఎన్నో...ప్రతి సమస్యకూ పరిష్కారం సమీప భవిష్యత్తులో ఉండే ఉంటుంది. అప్పటివరకూ మనం చేయగలిగిన ఉత్తమమైన పని చేస్తూ ఫలితం గురించి ఎదురుచూడటం మంచిది కదా? ఐతే అలా ఎదురుచూడగలిగిన ఓపిక కొంతమందికి ఉండదు. అందుకే ఈ ఆత్మహత్యలూ, హత్యలూ.... అలాగే ప్రయత్నిస్తూ ఎదురు చూసినంత మాత్రాన ఎప్పుడూ మనకు అనుకూల ఫలితాలు వస్తాయని కాదు. కానీ ఒక ప్రతికూలతను తట్టుకున్న అనుభవం వస్తుంది కదా! అటువంటివారిని చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది కదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి