1, జనవరి 2013, మంగళవారం

నాకిష్టం .......

నాకిష్టం .......
ఉదయాన్నే నీరెండలో కల్లానికి వెళ్లి రావటమంటే ఇష్టం.దారిలో వుండే పొలం బావిలో స్నేహితులతో కలసి ఈదటం అంటే ఇష్టం. ఖాళీ వుంటే కొండగుడికి వెళ్ళటం ఇష్టం.ఆదివారం వస్తే ఉదయం పక్క వూరిలో వున్న  గ్రంధాలయానికి  కాలినడకన వెళ్ళటం ఇష్టం.చెరువులో ఆడుకునే చేప పిల్లలను చూడటం ఇష్టం.గాలిపటాలు ఎగురవేయటం ఇష్టం.గెడ్డలో కాగితం పడవలు వదలటం ఇష్టం.వేసవిలో జతగాళ్ళతో కలిసి తాటికాయలూ,మామిడిపళ్ళు,వెలంపళ్ళు  తినటం ఇష్టం.అలాగే వర్షాకాలం మొదట్లో దొరికే నేరేడు పళ్ళు ,చివర్లో దొరికే సీతాఫలాలు ,శీతాకాలంలో దొరికే రేగుపళ్ళు,పరింపళ్ళు అంటే ఎంతో  ఇష్టం.ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఎక్కడినించో లీలగా వినపడే పాటలంటే ఇష్టం.మిట్ట మధ్యాహ్నం  పూట కల్లం దగ్గర చిక్కని చింత చెట్టు నీడలో కూర్చొని పక్షుల అరుపులు వినటం అంటే ఇష్టం.అమ్మ ప్రేమగా తిడితే ఇష్టం.స్నేహితులు ఆశ్చర్యపోతే ఇష్టం.పుస్తకాలంటే ఎంతో  ఇష్టం.కనుమ రోజు కొండగుడి దగ్గర జరిగే తీర్థం అంటే ఇష్టం.ఊర్లో జరిగే కృష్ణాష్టమి అంటే ఇష్టం.కుక్కపిల్లలంటే మహా ఇష్టం.చలికాలంలో కృష్ణుడి గుడి దగ్గర మంట వేసుకుని చలి కాగటం ఇష్టం.స్కూలు పక్కన బోరింగు దగ్గర చలికాలంలో వేన్నీళ్ళతో మెల్లగా స్నానం చెయ్యటం ఇష్టం.దీపావళిలో భూచక్రాలు వెలిగించటం ఇష్టం.సంక్రాంతి ముందు పెట్టే నేల గంట ముగ్గులంటే ఇష్టం.కనిపించకుండా కూసే కోయిలంటే ఇష్టం.ఎప్పుడూ తీరికలేకుండా సందడి చేసే పిచ్చుకల్ని చూడటమంటే ఇష్టం.చేలల్లో గుంపుగా ఎగిరే కొంగలను చూడటమంటే ఇష్టం.మొత్తంమీద మా ఊరంటే ఇష్టం.నా చుట్టూ వుండేవన్నీ నాకిష్టం.నేనంటే నాకిష్టం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి