13, ఫిబ్రవరి 2018, మంగళవారం

సయోధ్య!

సయోధ్య!

ఎర్రబాబు: సయోధ్యలో ఒక ఆసుపత్రి కడితే సరిపోతుంది. ఏ సమస్యా ఉండదు.

భక్తుడు: అన్నా! సయోధ్యలో స్వామి మందిరం కట్టడం తథ్యం. ఇక పోతే ఆసుపత్రి అన్నావు కదా. కాస్త విశాలంగా ఎందుకు ఆలోచించకూడదు నువ్వు? సయోధ్యలో కట్టే మందిరం దక్షిణంలో ఉన్న పరపతి ఆలయం స్థాయిలో ఉంటుంది. ఒక్క ఆసుపత్రే కాదు, దానికి అదనంగా ఒక విద్యాలయం, ఒక అన్నసత్రం, ఒక ఆవాస మందిరం ఇంకా చాలా వస్తాయి...మొత్తం మీద సయోధ్యకు ఒక రకమైన వైభవం వచ్చేస్తుంది. అది కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే ధనంతో. ప్రభుత్వనికి పెద్దగా ఖర్చు కూడా అవదు. అప్పుడు నిజంగానే ఏ సమస్యా ఉండదు కదా

ఎర్రబాబు: ఇక్కడ సమస్య అంటే ప్రజా సౌకర్యాల గురించి కాదు. కాబ్రి మసీదును కూల్చి అక్కడ మందిరం కడితే మత విద్వేషాలు పెరగవా? ఇప్పటికే కాబ్రి పేరుతో సింధువులపై ఎన్ని దాడులు జరుగుతున్నాయో చూసావా? ఇవన్నీ మనకు అవసరమంటావా?

భక్తుడు: చూడు ఎర్రబాబు... దేశ జనాభాలో మధ్యవాసియా మతస్తులు రమారమి 15% ఉన్నారనుకుంటే, వాళ్ళలో అత్యధికులకు సయోధ్యలోగల స్వామి మందిరంతో ఎటువంటి సమస్యా లేదు. మిగిలిన అల్ప సంఖ్యాక మధ్యవాసియా మతానుయూయులకు కాబ్రి కాకపోతే ఒక చశ్మీర్, ఒక పెరుగుస్తీనా, ఒక కర్కీ, ఒక అరెమికా, ఒక బోరింగ్యా ఇలా ఈ భూమ్మీద వాళ్ళ ఛాందసవాదానికి ప్రతిఘటన ఎదురయ్యే ప్రతీ సారీ మనదేశంలో కూడా కంగాళీ జరుగుతుంది. కాబ్రీలో ఒక మసీదు లేదా ఆసుపత్రి కట్టడం వల్ల అది ఆగదు. సింధువులపై దాడులు జరుగుతున్నాయని అస్తిత్వాన్ని కోల్పోమంటావా? ప్రతీకార దాడులు జరిగితే ఇదే సలహా మధ్యవాసియా మతస్తులకు ఇవ్వగలవా?

ఎర్రబాబు: ఇది ఒక్క స్వామి మందిరంతో ఆగుతుందా? తటస్థంగా ఉండే మధ్యవాసీయ మతావలంబకులు కూడా ఈ చర్య వలన ఛాందసవాదుల పక్షాన చేరే అవకాశం ఉంది. మన సింధువులలోనే చాలా మందికి అక్కడ మందిరం కట్టడం ఇష్టం లేదు. అక్కడ మందిరం కట్టడం వల్ల అశాంతి తప్ప మరింకేం సాధించలేము.

భక్తుడు: అయ్యా నిజమే. ఇది ఒక్క స్వామి మందిరంతో ఆగదు. అన్నీ కాకపోయినా కొన్నింటిని మాత్రం తిరిగి పునరుద్ధరించవలసియున్నది. ఇక కొత్తగా మనం పొందే అశాంతి ఏముంది? అది ఎప్పటినుంచో తిష్ఠ వేసింది మన దేశంలో. ఒక్కసారి ఎవరి పరిధి ఎంతవరకు అన్న స్పష్టత వస్తే శాంతి దానంతట అదే వస్తుంది. అసలు మన దేశంలో ఉన్న విదేశీ మతస్తులంతా ఒకప్పటి సింధువులే కదా. బలవంతానో, ప్రలోభం చేతనో లేక మరే ఇతర కారణం వల్లనో వారు మతం మారవలసి వచ్చింది. ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తే సరిపోతుంది. తమ మూలాలు సింధు దేశంలోనే ఉన్నాయిగానీ మరెక్కడో మధ్యవాసియాలో కాదు అన్న సత్యం ఎరుక పడితే సమస్య ఉండదు. లేదూ మా మూలం మధ్య ఆసియా అంటారా, మరిక్కడెందుకు వారి పెత్తనం.

ఎర్రబాబు: అంటే ఈ దేశం కేవలం సింధువులదేనా?

భక్తుడు: ఈ దేశం రాజ్యాంగం ప్రకారం ఎవరు అర్హులో వారందరిది.

ఎర్రబాబు: సరే. అయ్యిందేదో అయ్యింది. అందరూ సుఖంగా ఉండొచ్చుగా. గతాన్ని తవ్వుకొని ఈ గొడవలన్నీ ఎందుకూ?

భక్తుడు: నాయనా ఎర్రబాబూ, నీది అమాయకత్వమా లేదా ముసుగా అన్న విషయం తెలియటంలేదు. నీది ముసుగు అన్న విషయం కూడా ఎరుకపడని అమాయకత్వం కావచ్చు. సయోధ్యలో స్వామి మందిరం తథ్యం. ఆ నిజంతో బ్రతకడం అలవాటు చేసుకో.సెలవు.

(Most of the names are taken from the blog www.tetageeti.wordpress.com)