18, జులై 2015, శనివారం

తెలుగు పాఠ్యపుస్తకాలతో నా పయనం

హ్మ్...... ఎక్కడి నుండి మొదలెట్టాలి?

"చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ ....... "నా  లేకపోతే  "బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెల్తివి....."నా లేక మరొకటా.

చిన్నప్పుడు, ఏ తరగతిలోనో గుర్తులేదు, చిలకమ్మ పెండ్లి అని ఒక గేయం వుండేది. అందులో చిలకా గోరింకల పెళ్ళిని అడవిలో గల జంతువులన్నీ వచ్చి జరిపిస్తాయి. గేయం గుర్తు లేదు గానీ, ఆ గేయం చదివిన అనుభవం గుర్తుంది. పుస్తకంలో ఆ గేయం చుట్టూ ముద్రించిన అల్లుకుపోయిన అడవి బొమ్మ అందులో చాలా జంతువులూ పక్షుల బొమ్మలతో చాల నిండుగా వుండేది ఆ పుట.

ఇక జగత్ప్రసిద్దమైన పులి-బంగారు కడియం పాఠంలో బాటసారికి మెరుస్తున్న బంగారు కడియాన్ని చూపిస్తున్న టక్కరి పులి బొమ్మ, వామ్మో  పులి!! అనుకునేలా చేసింది.  కాకి-నక్క పాఠం చదివిన తరువాత రెంటికీ బుద్ధిలేదని అనిపించింది. అవును. కుందేలు-తాబేలు పాఠంలో తాబేలు గెలుపు ఎందుకో అంతగా రుచించలేదు. ఎంత పొగరుమోత్తనం ఉన్నప్పటికీ పరుగుపందెం మధ్యలో కుందేలు ఎందుకు పడుకుంటుందీ? ఎవరో కావాలనే అసలు కథని మార్చి రాసేసారని నా భావన. ఇంక  పులి-ఆవు కథకు వస్తే మూడు బొమ్మలుండేవనుకుంటా ఈ పాఠంలో. ఈ పాఠంలో పులి ఆవు తెగ నచ్చేసాయి నాకైతే. మూడు చేపల కథ పాఠం ఎంతబాగుండేదని!దాదాపుగా విష్ణుశర్మ పంచతంత్ర కథలు ఒక్కటైనా సరే ప్రతీ తరగతిలోనూ పాఠ్యాంశంగా వుండేవి. 

"ఆబ్బబ్బ నాయెత్తు ఆకాశమంత ...." అంటూ మఱ్ఱి విత్తనాన్ని గేలిచేసిన తాటిచెట్టు చివరికి అదే మఱ్ఱి చెట్టు నీడలో నశించిపోవడం, మఱ్ఱిచెట్టు తాటిచెట్ల బొమ్మలు ఉన్న తాటిచెట్టు పాఠం జీవితాంతం గుర్తుంచుకోవలసిన ఆణిముత్యం అని అప్పుడు తెలియలేదు సుమీ. తండ్రి చనిపోయిన తరువాత తమకు మిగిలిన చెట్టు, ఆవు, కంబలిలను తెలివిగా తనకి లాభం చేకూర్చేలా పంపకాలు చేసుకున్న అన్న, తమ్ముడి భార్య తెలివితేటలతో కొట్టిన దెబ్బకి దారికి రావటం చూసిన తరవాత, పాపం భార్య లేకపొతే ఆ అమాయక తమ్ముడి పరిస్థితి ఏమయ్యేదో అని జాలేసింది. ఇక పరస్పర సాయాన్ని గురించి చెప్పే పావురం-చీమ పాఠం గురించి చెప్పుకోవాలీ....ఈ కథ ప్రేరణతో నేను చీమలను కావాలని నీటిలో పడేసి పక్కన ఆకు కూడా వేసేవాడ్ని, అవి ఎలాగా ఎక్కుతాయా అని చూడ్డానికి. నాకు గుర్తున్నన్తవరకూ అవి చాలా సులభంగా ఈదుకొని ఒడ్డుకి వచినట్టు గుర్తు, నేను వేసిన ఆకుకి కనీసం గౌరవం కుడా ఇవ్వకుండా...హు ఏంచేస్తాం. 

ఐదవ తరగతిలో తరగని చెట్టు అనే పాఠం వుండేది. పొదుపు యొక్క ఆవశ్యకతను తెలిపే ఇద్దరు చైనా మిత్రుల కథ ఇది. ఈ కథలోని చింతచెట్టు ఆకుల వలె మనం క్రమ శిక్షణతో చేసిన పొదుపు అనేది నిరంతరం పెరుగుతూనే వుంటుంది గానీ దానికి తరుగుదల వుండదని ఈ కథ సారాంశం. ఇద్దరు చైనా మిత్రులూ ఎదురెదురుగా నుంచునే బొమ్మ వుండేదనుకుంటాను ఈ పాఠంలో. ఇదే తరగతిలో పులినే బోల్తా కొట్టించిన పేదరాసి పెద్దమ్మ కథ కూడా వుండేది. గుమ్మడి బానలో కూర్చొని పేదరాసి పెద్దమ్మ అడవిలో దొర్లుకొని పోవటం, నోట్లో ఇసుక పెట్టుకొని దాన్ని పులి కళ్ళలోకి ఊదటం ద్వారా దాని బారినుంచి తప్పించుకోవటం భలే గమ్మత్తుగా వుండేది చదువుతుంటే. బానలో అడవిగుండా దొర్లుతున్న పేదరాసి పెద్దమ్మ బొమ్మ నాకు బాగా గుర్తుంది.

ఇక తరువాతి తరగతులనుంచి మాకు తెలుగులో ఉపవాచాకాలు కుడా ప్రారంభం అయ్యాయి. సర్ ఆర్థర్ కాటన్ దొర జీవితం, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహనీయుల జీవితాలు పరిచయం చేయబడ్డాయి వాటిలో మాకు. అలాగే పదవ తరగతి ఉపవాచక పుస్తకం అట్టపై పంచెకట్టు, పైన ఓవరు కోటు, దొరల టోపీ అలాగే  చేతిలో గొడుగుతో కనిపించే  బారిస్టరు పార్వతీశం పదవ తరగతి ఆసాంతం కడుపుబ్బ నవ్వించినా, ఒక్కొక్కప్పుడు అంత అమాయకత్వంతో ఎలా నెట్టుకొస్తాడో అని గుబులేసేది. 

ఇక  ప్రతి తరగతిలో భేతాలుడిలాగా వెంటబడే సుభాషితరత్నాల గురించి చెప్పుకోవాలి. "ఉప్పు కప్పురంబు ...." అంటూ మొదలైన వేమన శతకం , "వినదగునెవ్వరు చెప్పిన..." అంటూ మొదలైన సుమతీ శతకం , "ఆరంభింపరు నీచమానవులు....." అంటూ గడ్డిపెట్టిన భర్తృహరి సుభాషితాలు , "వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు..." అని బోధించిన తెలుగుబాల శతకం ఇంకా అలాగే మధ్యమధ్యలో చుట్టాల్లా వచ్చే కుమార, నృసింహ, కాళహస్తీశ్వర శతకాలు మొదట్లో తెగ ఇబ్బంది పెట్టినా లోకజ్ఞానం రూపుదిద్దుకొంటున్నకొద్దీ వాటిపై వల్లమాలిన అభిమానం పెరిగిపోయింది. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పద్యాలను రాగయుక్తంగా పాడుకోనేవాడిని. (ఈ అలవాటు ఇప్పటికీ ఉందండోయ్)

పాత రోజుల గొప్పతనాన్ని వివరించే రష్యా కథ "గోధుమ గింజ"; బాల్య వివాహపు దుష్ప్రభావాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే గురజాడ వారి" పూర్ణమ్మ" గేయం మరియు ఆ పాఠంలో దుర్గ గుడి పక్కన కొలను దగ్గర పూలసజ్జతో పూర్ణమ్మ బొమ్మ...అనవసరంగా చనిపోయిన పూర్ణమ్మ గురించి ఎక్కడో బాధ, ఆ ముసలి పెళ్లికొడుకుపై అసహ్యం; చీమల్లో గూండా చీమలు కూడా ఉంటాయా? అని విస్మయపరచిన "చీమతల్లి విశ్వాసం"; ఒక్కపెట్టున బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చిన శ్రీశ్రీ గారి "శైశవ గీతి" అబ్బో ఇవన్నీ ఒక పట్టాన స్థిమితంగా ఉండనిచ్చేవి కావు.

"కళ్యాణకటకమను పట్టణమున భైరవుండను వ్యాధుడుండెడివాడు...... " అంటూ శుద్ధ గ్రాంధికంలో వుండే "దురాశ" పాఠంలో నక్క ప్రదర్శించిన లక్షణాన్ని దురాశ అంటారంటే మొదట్లో నాకు భావ్యం అనిపించలేదు. "బాల్యోపచారాలు" లో బెజ్జమహాదేవి శివునికి చేసిన సేవలు, "శ్రీ కృష్ణ లీలలు" లో బాల కృష్ణుని ఆగడాలూ, "ప్రవరుని స్వగతం " లోని "అటంజని కాంచె భూమిసురడంబరఛుంబి .... " అంటూ సాగే ప్రాసయుక్తమైన పద్యాలూ, ఒక "జడివాన ", ఒక "మాతృ హృదయం", ఒక "తామసి", ఒక "బొండు మల్లెలు ", ఒక " బుడుగు" ఓరి బాబోయ్ ఒక జీవితంలో ఎన్ని కోణాలు, ఎన్ని అనుభవాలు! గోపీచంద్ "మాకూ వున్నాయి స్వగతాలు" నుంచి గ్రహించిన "తుమ్మచెట్టు" పాఠంలో తుమ్మచెట్టు తన అనుభవాలు చెబుతున్నప్పుడు నాకేమాత్రం అనుమానం కలుగలేదు సుమీ. మా వూర్లో ఎక్కడపడితే అక్కడ కనిపించే మా తుమ్మచెట్లకు స్వర్ణపుష్పి అన్న అందమైన పేరుందని తెలిసిన తరువాతే కదా బంగారు రంగు పూవులతో ఆర్భాటం లేకుండా గమ్మునుండే మా స్వర్ణపుష్పి సౌందర్యాన్ని చూడగలిగింది. 

మొత్తానికి ఈ పాఠాలన్నీ అప్పట్లో చాలావరకూ పరీక్షల కొఱకే చదివినా,  జీవితంలో ముందుకు పోతున్నకొద్దీ ఎప్పటికప్పుడు క్రొంగొత్త సవాళ్ళను విసురుతున్న రేపటిని ధైర్యంగా ఎదుర్కోవడానికీ, నా పయనం యొక్క గమ్యంపై స్పష్టత గురించీ నాకు కావలసిన ప్రేరణని ఎక్కడో సుప్తచేతనంలో జీర్ణిచుకుపోయిన ఈ పాఠాలే ఇస్తున్నాయేమొనని నా నమ్మకం. 


ఇదండీ తెలుగు పాఠ్యపుస్తకాలతో నా పయనం. ఇందులో నేను గుర్తు తెచ్చుకోగలిగిన పాఠ్యంశాలను మాత్రమే ఉటంకించడం జరిగింది. వాస్తవానికి ప్రతీ పాఠమూ నాకు బాహ్య స్మృతిలో గుర్తున్నా లేకున్నా, అది నాకు అభిమానపాత్రం మరియు గురుతుల్యం. ఒకవేళ మీకు ఏమైనా గుర్తుంటే వాటి పేర్లను వ్యాఖ్యలలో ఉటంకించగలరు. 

సమాప్తం.